మొక్కజొన్న కంకులను తీసుకొని దానికి ఉండే దారాల్లాంటి పీచు (కార్న్ సిల్క్)ను మాత్రం తీసి పారేస్తుంటాం. అయితే, ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పీచును ప్రపంచవ్యాప్తంగా వివిధ రపాల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని సేకరించి, ఎండబెట్టి అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న సాగులో ప్రపంచంలో భారత్ 6వ స్థానంలో ఉంది. 2021–22 రబీ గణాంకాల ప్రకారం ఏపీలో 4.82 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో 4.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది.
మొక్కజొన్న కండెలు కోసేటప్పుడే పీచును కండె నుంచి తీసి జాగ్రత్త చేసుకోవాలి. సేకరించిన పీచును 0.1% ఉప్పు ద్రావణంతో కడిగి శుభ్రం చేసి ఎండబెట్టాలి. తేమ శాతం 7–10% మధ్యలో ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పీచును అనేక ఆహారోత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. ఒక మొక్కజొన్న పొత్తు నుంచి జాగ్రత్తగా సేకరించి ఎండబెడితే సగటున ఒక గ్రాము పీచు వస్తుందని అంచనా. ఏక పంటగా సాగు చేస్తే ఎకరానికి 32 వేల మొక్కలు వేస్తారు. అంటే, ఎకరానికి 32 కిలోల ఎండు పీచును సేకరించవచ్చన్న మాట.
షుగర్, కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం
మొక్కజొన్న పీచులో అధిక పోషక విలువలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు,కాల్షియం, పొటాషియం, వంగనీసు, సిటోస్టెరాల్, స్టిగ్మాస్టెరాల్, అల్కలాయిడ్లు, సపోనిన్లు, టాన్నిన్లు, ఫ్లావనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. దేహంలో నుంచి అధిక నీటిని బయటకు పంపుతుంది. మూత్రవిసర్జనను సులభతరం చేయటం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. మూత్రవిసర్జనలో నొప్పి, మూత్రనాళంలో/ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇన్సులిన్ సహజ ఉత్పత్తిని పెంపొందించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్టరాల్ సమస్యలను నివారిస్తుంది. గౌట్ నొప్పిని తగ్గిస్తుంది. కొవ్వును నియంత్రించి అధిక బరువును నివారించడానికి కూడా మొక్కజొన్న పీచు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.
ఆహారోత్పత్తులెన్నో..
బ్రెడ్, బిస్కట్ల తయారీలో మొక్కజొన్న పీచు పొడిని కొద్ది మేరకు కలుపుతున్నారు. దీన్ని కలిపినందు వల్ల వాటి రంగు, వాసన ఏమీ మారవు. పోషక విలువలు పెరుగుతాయి. బియ్యపు పిండి, పచ్చి బొప్పాయి, నువ్వుల పిండితో మొక్కజొన్న పీచు పొడిని గరిష్టంగా 10% కలుపుతూ ఆరోగ్యదాయకమైన లడ్డూలు తయారు చేయొచ్చు. చపాతీ, పరోటా, రైతా, పప్పు వంటి వంటకాల్లో మొక్కజొన్న పీచు పొడిని కలుపుకుంటే మం పోషక విలువలు లభిస్తాయి. టాబ్లెట్లను కూడా మొక్కజొన్న పీచుతో తయారు చేయవచ్చు. బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యం కోసం ఈ టాబ్లెట్లను వాడుతున్నారు. ఒక్కో మాత్రను ర.20 వరక ధర పలుకుతోందట. మొక్కజొన్న పీచు ప్రాసెసింగ్, నిల్వకు అధిక ఖర్చుతో కూడిన నిర్మాణాలు అవసరం లేదు.
మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, గ్రామీణ నిరుద్యోగులకు మొక్కజొన్న పీచు సేకరణ ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. మొక్కజొన్న రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి/సేంద్రియ రైతులకు మరింత ఉపయోగకరమని చెప్పొచ్చు. మొక్కజొన్న పీచుతో టీ ఇలా.. ఎండబెట్టిన మొక్కజొన్న పీచుతో టీ(కషాయం) కాచుకొని తాగటం ఒక మేలైన పద్ధతి. 2 కప్పుల నీటిలో 2 చెంచాల ఎండిన పీచును కలిపి, తక్కువ మంటపై 10 నిమిషాలు మరిగించి వడకడితే.. చక్కటి టీ రెడీ అవుతుంది. బెల్లం, పంచదార, తేనె తగుమాత్రంగా కలిపి రోజుకు 3 కప్పుల వరకు తాగొచ్చు. వట్టి మొక్కజొన్న పీచు టీకి కొంచెం మట్టి వాసన ఉంటుంది. అందుకని ఇతర పదార్థాలతో కలిపి టీపొడిని తయారు చేసుకొని వాడొచ్చు. ఎండిన మొక్కజొన్న పీచు, ఎండు నిమ్మ బద్దలను వేర్వేరుగా పిండి చేసి కలిపి టీ కాచుకోవచ్చు.
(చదవండి: 'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!)
Comments
Please login to add a commentAdd a comment