silk .. Fabric
-
పీచే కదా అని తీసిపడేయకండి!
మొక్కజొన్న కంకులను తీసుకొని దానికి ఉండే దారాల్లాంటి పీచు (కార్న్ సిల్క్)ను మాత్రం తీసి పారేస్తుంటాం. అయితే, ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పీచును ప్రపంచవ్యాప్తంగా వివిధ రపాల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని సేకరించి, ఎండబెట్టి అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న సాగులో ప్రపంచంలో భారత్ 6వ స్థానంలో ఉంది. 2021–22 రబీ గణాంకాల ప్రకారం ఏపీలో 4.82 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో 4.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. మొక్కజొన్న కండెలు కోసేటప్పుడే పీచును కండె నుంచి తీసి జాగ్రత్త చేసుకోవాలి. సేకరించిన పీచును 0.1% ఉప్పు ద్రావణంతో కడిగి శుభ్రం చేసి ఎండబెట్టాలి. తేమ శాతం 7–10% మధ్యలో ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పీచును అనేక ఆహారోత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. ఒక మొక్కజొన్న పొత్తు నుంచి జాగ్రత్తగా సేకరించి ఎండబెడితే సగటున ఒక గ్రాము పీచు వస్తుందని అంచనా. ఏక పంటగా సాగు చేస్తే ఎకరానికి 32 వేల మొక్కలు వేస్తారు. అంటే, ఎకరానికి 32 కిలోల ఎండు పీచును సేకరించవచ్చన్న మాట. షుగర్, కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం మొక్కజొన్న పీచులో అధిక పోషక విలువలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు,కాల్షియం, పొటాషియం, వంగనీసు, సిటోస్టెరాల్, స్టిగ్మాస్టెరాల్, అల్కలాయిడ్లు, సపోనిన్లు, టాన్నిన్లు, ఫ్లావనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. దేహంలో నుంచి అధిక నీటిని బయటకు పంపుతుంది. మూత్రవిసర్జనను సులభతరం చేయటం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. మూత్రవిసర్జనలో నొప్పి, మూత్రనాళంలో/ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇన్సులిన్ సహజ ఉత్పత్తిని పెంపొందించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్టరాల్ సమస్యలను నివారిస్తుంది. గౌట్ నొప్పిని తగ్గిస్తుంది. కొవ్వును నియంత్రించి అధిక బరువును నివారించడానికి కూడా మొక్కజొన్న పీచు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఆహారోత్పత్తులెన్నో.. బ్రెడ్, బిస్కట్ల తయారీలో మొక్కజొన్న పీచు పొడిని కొద్ది మేరకు కలుపుతున్నారు. దీన్ని కలిపినందు వల్ల వాటి రంగు, వాసన ఏమీ మారవు. పోషక విలువలు పెరుగుతాయి. బియ్యపు పిండి, పచ్చి బొప్పాయి, నువ్వుల పిండితో మొక్కజొన్న పీచు పొడిని గరిష్టంగా 10% కలుపుతూ ఆరోగ్యదాయకమైన లడ్డూలు తయారు చేయొచ్చు. చపాతీ, పరోటా, రైతా, పప్పు వంటి వంటకాల్లో మొక్కజొన్న పీచు పొడిని కలుపుకుంటే మం పోషక విలువలు లభిస్తాయి. టాబ్లెట్లను కూడా మొక్కజొన్న పీచుతో తయారు చేయవచ్చు. బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యం కోసం ఈ టాబ్లెట్లను వాడుతున్నారు. ఒక్కో మాత్రను ర.20 వరక ధర పలుకుతోందట. మొక్కజొన్న పీచు ప్రాసెసింగ్, నిల్వకు అధిక ఖర్చుతో కూడిన నిర్మాణాలు అవసరం లేదు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, గ్రామీణ నిరుద్యోగులకు మొక్కజొన్న పీచు సేకరణ ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. మొక్కజొన్న రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి/సేంద్రియ రైతులకు మరింత ఉపయోగకరమని చెప్పొచ్చు. మొక్కజొన్న పీచుతో టీ ఇలా.. ఎండబెట్టిన మొక్కజొన్న పీచుతో టీ(కషాయం) కాచుకొని తాగటం ఒక మేలైన పద్ధతి. 2 కప్పుల నీటిలో 2 చెంచాల ఎండిన పీచును కలిపి, తక్కువ మంటపై 10 నిమిషాలు మరిగించి వడకడితే.. చక్కటి టీ రెడీ అవుతుంది. బెల్లం, పంచదార, తేనె తగుమాత్రంగా కలిపి రోజుకు 3 కప్పుల వరకు తాగొచ్చు. వట్టి మొక్కజొన్న పీచు టీకి కొంచెం మట్టి వాసన ఉంటుంది. అందుకని ఇతర పదార్థాలతో కలిపి టీపొడిని తయారు చేసుకొని వాడొచ్చు. ఎండిన మొక్కజొన్న పీచు, ఎండు నిమ్మ బద్దలను వేర్వేరుగా పిండి చేసి కలిపి టీ కాచుకోవచ్చు. (చదవండి: 'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!) -
ముడతలూ ఫ్యాషనే!!
ముస్తాబు క్రష్డ్ డిజైనర్ డ్రెస్సులు కొనుగోలు చేసేటప్పుడు, వాటికి వచ్చే ట్యాగ్‌లైన్స్ చదివి, అందులోని పద్ధతులను పాటించడం మర్చిపోవద్దు. ముడతల దుస్తులను ఇస్త్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ‘ఈజీ టు వేర్’ కాటన్, సిల్క్.. ఫ్యాబ్రిక్ ఏదైనా క్రష్డ్ డ్రెస్సులను ఇస్త్రీ చేయకూడదు. ఒకసారి ఇస్త్రీ చేస్తే మళ్లీ ముడతలు తేవడం సాధ్యం కాదు. ఇస్త్రీ మడత నలగకుండా ఒంటిమీద దుస్తులుండటం అందంగా భావిస్తారు ఎవరైనా..! కానీ, ధరించిన దుస్తులు ముడతలు ముడతలుగా ఉంటే.. !! ‘ఎవరైనా చిరాకు పడతారు’ అనేవారికి సరైన సమాధానం ముడతల దుస్తులు. అవేనండి క్రష్డ్ మెటీరియల్‌తో రూపొందించిన డిజైనర్ డ్రెస్సులు. ఎందుకంటే ముడతల దుస్తులే ఇప్పటి ట్రెండ్!!! ఎలా?! అని ఆశ్చర్యపోతే.. సమాధానం ఇక్కడే దొరుకుతుంది. ఈ కాలంలో దుస్తులు కేవలం అవసరమో, సౌకర్యం కోసమో మాత్రమే కాదు. దుస్తులు హోదాగా భావిస్తున్నారు. ఎంత ఫ్యాషనబుల్‌గా దుస్తులను ధరిస్తే అంత విలాసవంతులు గానూ, సృజనాత్మకత గలవారుగానూ గుర్తింపు పొందుతున్నారు. అందువల్లే రకరకాల ఫ్యాబ్రిక్స్ కళాత్మకతకు క్యాన్వాసులుగా మారుతున్నాయి. దేనికవి ప్రత్యేకతను చాటుతున్నాయి. సాంకేతిక పద్ధతులు... వస్త్రం అసాధారణంగా కనిపించేలా తయారుచేయడానికి తయారీదారులు వినియోగదారుల అంచనాలు ఏ విధంగా మారుతున్నాయో ఆలోచిస్తున్నారు. అందుకే విభిన్నమైన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఫ్యాబ్రిక్‌ని ఒక ప్రత్యేక ఆకర్షణ ఉట్టిపడేలా రూపొందిస్తున్నారు. ఆ పద్ధతుల్లో పుట్టుకొచ్చిన వస్త్రమే ‘క్రష్డ్ ఫ్యాబ్రిక్.’ ముడతలుగా ఉండే ఈ ఫ్యాబ్రిక్ చూపులను ఇట్టే ఆకట్టుకుంటుంది. సాధారణ పద్ధతులు... వస్త్రాన్ని మెలికలు తిప్పడం, రోల్ చేయడం ద్వారానే కాకుండా బాగా వేడిగా ఉండే ద్రవాలలో ఉడికించి ముడతలు తెప్పిస్తుంటారు. ఈ విధానంలో రాయి ఎలా కనిపిస్తుందో అలాంటి టెక్స్చర్ను మెటీరియల్‌కు తీసుకువస్తారు. మరొక పద్ధతిలో... ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్‌పైన రంగులు అద్ది, వేడి నీటిలో ఉడకబెట్టి, ఆ తర్వాత ‘రోల్’ చేస్తారు. ఈ వస్త్రంపై బరువును ఉంచి, అదనపు నీళ్లన్నీ బయటకు వచ్చేశాక దానిని ఆరబెట్టే యంత్రంలో ఉంచుతారు. ఈ ప్రక్రియ వల్ల ఫ్యాబ్రిక్ యాదృచ్ఛికంగా ముడతలు పడుతుంది. బాగా ముడతలు పడిన ఈ వస్త్రాన్ని డిజైనర్ దుస్తుల తయారీకి ఉపయుక్తం. మఖ్మల్ ముడతలు... క్రష్డ్ వెల్వెట్, పన్నె వెల్వెట్ ... అని ఈ మెటీరియల్ రెండు పద్ధతుల్లో లభిస్తుంది. వెల్వెట్ క్లాత్ తడిగా ఉన్నప్పుడు దగ్గరగా మడవడం వల్ల ముడతలు పడుతుంది. ‘పన్నె వెల్వెట్’ ప్రక్రియలో మెటీరియల్‌పై సాంకేతికపరంగా కొంత ఒత్తిడి తీసుకువచ్చి, ముడతలు చేస్తారు. ఈ వెల్వెట్‌ను కర్టెన్లు, దిండుగలీబులు, కార్ సీట్ కవర్లు, హ్యాండ్ బ్యాగులకు ఉపయోగిస్తారు. అయితే దుస్తుల తయారీ నిపుణుల దృష్టి ముడతలు పడిన మఖమల్ క్లాత్‌పై పడటంతో ఈ వస్త్రం మరింత వన్నెలద్దుకొని వనితల మేనిపైకి చేరింది. క్రష్డ్ వెల్వెట్ సంప్రదాయ దుస్తుల జాబితాలో చేరిపోయింది. దీంట్లో భిన్నమైన డిజైన్లు పడతుల మతులు పోగొడుతున్నాయి. సిల్క్ ముడతలు... సిల్క్, శాటిన్, షిఫాన్.. ఫ్యాబ్రిక్ లో ముడతలు తీసుకురావాలంటే వస్త్రాన్ని తయారుచేసేటప్పుడే ఒక ప్రత్యేకమైన టెక్స్చర్ను తీసుకురావాలి. దారం ఎంపిక, ముడతల ప్రక్రియ దశలవారీగా జరగాలి. ఇందులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం సిల్క్ ఫ్యాబ్రిక్‌ను మరింతగా అందంగా మార్చుతోంది. ఈ ఫ్యాబ్రిక్ డిజైనర్ దుస్తులకు ఎక్కువ ఉపయోగకారి. నిర్వహణ... మిగతా వాటితో పోలిస్తే క్రష్డ్ ఫ్యాబ్రిక్ నిర్వహణ సులువు. క్రష్డ్ ఫ్యాబ్రిక్ పూర్తిగా ముడతలతో నిండి ఉంటుంది. ఈ వస్త్రాన్ని మడత పెట్టేటప్పుడు చాలా దగ్గరగా, గట్టిగా కట్టి ఉంచాలి. మఖమల్ వస్త్రమైతే మెషిన్ వాష్ చేయడం మేలు. క్రష్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే పూర్తిగా డ్రై క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్రష్డ్ ఫ్యాబ్రిక్ అందమైనది, విలాసవంతమైనది. ధరించగానే ఆహార్యంలో ఓ కొత్త మార్పు తీసుకువస్తుంది. ఆ మార్పు మీరూ కోరుకుంటే మడత నలగని వస్త్రాలకే కాదు ‘ముడతలు’గల డ్రెస్సులకూ ఇప్పుడే ఆహ్వానం పలకవచ్చు.