రేపల్లె: పంట పొలాలను పందులు పాడు చేస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగు మందు డబ్బా తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన సంఘటన సోమవారం పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని 8వవార్డు సమీపంలో ఉన్న పంట పొలంలో ఖరీఫ్ సాగు వరిని పందులు పాడు చేశాయని, ప్రస్తుతం జొన్న పంటను నాశనం చేస్తున్నదని, మూడేళ్లుగా ఇదేవిధంగా జరుగుతుండడంతో నష్టాలబారిన పడుతున్నానని రైతు దేవగిరి శివశంకర్ అనే రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణానికి చెందిన పందుల పెంపకందారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తాము నష్టపోవాల్సివస్తోందని వాపోయాడు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణం చర్యలు తీసుకుని మిగిలి ఉన్న పంటనైనా కాపాడాలని, లేకుంటే పురుగుల మందు తాగి తాను చనిపోతానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మారుతీ దివాకర్ హుటాహుటిన మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని శివశంకర్ సమస్యపై సానుకూలంగా స్పందించారు. తక్షణం పందుల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
పందులను తరలించే కార్యక్రమానికి శ్రీకారం
పట్టణంలో పందులను తరలించే కార్యక్రమానికి మంగళవారం నుంచే శ్రీకారం చుడుతున్నట్టు మున్సిపల్ కమిషనర్ మారుతీ దివాకర్ ప్రకటించారు. పట్టణంలో జనావాసాల మధ్య పందుల పెంపకం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు. పందులు పంటలను పాడు చేసినా, పట్టణ రహదారుల్లో సంచరించినా సహించేది లేదని, పందుల పెంపకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment