ఆ ‘రాజు’తోనే...
- రాజన్న పాలనలో రైతే రాజు..
- మహానేత మరణంతో కష్టాల్లో అన్నదాత
- ప్రకటనలకే పరిమితమైన ఇన్‌పుట్ సబ్సిడీ
- పూర్తిగా పంపిణీ కాని 2011 పరిహారం
- రూ.11 కోట్ల పరిహారానికి మోక్షం లేదు
- పథకంపై నమ్మకం కోల్పోయిన రైతులు
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రైతు విలవిలలా డాల్సిందే. ఆరుగాలం కష్టం నీటిపాలైతే కన్నీరుమున్నీరవాల్సిందే. ఆదుకునేవారులేక విలపించాల్సిందే. కరువుకాటకాలతో పంటలు పండకపోయినా పట్టించుకునేవారు కాదు. విత్తనాలు, ఎరువులు ఇచ్చినా అరకొరగానే. రైతు అడిగిన ఎరువు.. కోరిన విత్తనం ఇచ్చేవారు కాదు.
మహానేత ముఖ్యమంత్రి అయ్యాక... పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇన్‌పుట్ సబ్సిడీ పథకంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఏ ఒక్కరైతూ తన పంట దెబ్బతిన్నదని..తనకు పంట నష్టపరిహారం రాలేదని..కోరుకున్న విత్తనాలు, కోరిన ఎరువులు ఇవ్వలేదని నిరుత్సాహ పడవద్దు.. వ్యవసాయం చేయడానికి వెనుకంజవేయవద్దు.. అని భావించిన మహానేత ఇన్‌పుట్ సబ్సిడీ పథకంలో మార్పులు తీసుకొచ్చారు. పంటనష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేశారు.
కానీ ఇప్పుడు... ఎంత వేగంగా రైతు అభివృద్ధిపథంలోకి దూసుకెళ్లాడో అంతేవేగంగా అగాధంలోకి నెట్టివేయబడ్డాడు. దండగన్న వ్యవసాయాన్ని మహానేత పండగ చేస్తే ఆయన తర్వాత వచ్చిన పాలకులు మళ్లీ రైతును కష్టాల్లోకి నెట్టారు. ఆరుగాలం కష్టం నీటిపాలైతే ఆదుకునేవారులేక..2011సంవత్సరం నాటి నష్టపరిహారం నేటికీ సక్రమంగా పంపిణీ కాక రైతు దివాలా తీశాడు. పాలకుల నిర్లక్ష్యంతో ఇన్‌పుట్ సబ్సిడీ కాస్త ఇన్‘ఫట్’ సబ్సిడీగా మారిపోయింది.
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: వైఎస్ మరణానంతరం ఇన్‌పుట్ సబ్సిడీ పథకం లక్ష్యం దెబ్బతింటోంది. అతివృష్టి, అనావృష్టి, అకాలవర్షాలతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ఉద్దేశించిన ఈ పథకం నిష్ర్పయోజనంగా మారింది. తొలుత ఈ పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఆ తర్వాత పరిహారం రైతుల చేతికందేది. మహానేత మరణానంతరం ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడిచింది. జిల్లాలో ఏటా పంట నష్టాలు సంభవించినా రైతులకు పరిహారం అందడం లేదు.ఐదేళ్లలో జిల్లాలో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. లైలా, జల్, నీలం తుపాన్లు, కరువు పరిస్థితులతో రైతులు పంటలను కోల్పోయారు. పంట నివేదికలను అధికారులు ఆర్భాటంగా తయారు చేసుకొని వెళ్లినా.. చివరకు అర్హులైన రైతులకు పరిహారం మాత్రం అందడం లేదు.
మహానేత వైఎస్ పాలనలో...
రైతును రాజుగా చూడాలని పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పంటనష్టపరిహారాలను ఏవిధంగా చెల్లించారో చూద్దాం. జిల్లాలో 2006లో పంటనష్ట పరిహారం కింద రూ. 7.22 కోట్లు, 2007లో రూ.40.49 లక్షలు, 2008లో రూ. 6.29 కోట్లు, 2009లో రూ.9.58 కోట్లను రైతులకు అందజేశారు. అప్పట్లో అర్హులైన రైతులందరికీ పరిహారం అందింది. పంట నష్టపోయినా సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు సబ్సిడీ కింద ఇచ్చారు. మహానేత మరణానంతరం రైతులు దిక్కులేని వారయ్యారు. సకాలంలో వర్షాలు పడలేదు. అనునిత్యం విద్యుత్ కోతలు, వాడకంపై ఆంక్షలు పెట్టి రైతులను అష్టకష్టాలు పెట్టారు.
2010లో సంభవించిన జల్ తుపాను రైతులను అతలాకుతలం చేసినా మొక్కుబడిగానే పరిహారం అందించారు. 2011లో జిల్లావ్యాప్తంగా కరువు నెలకొంది. అనావృష్టి కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయి. జిల్లాలో మొత్తం 2,96,789 మంది రైతులకు పంటనష్ట పరిహారంగా రూ.111.6 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. కానీ బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆన్‌లైన్‌లో తప్పులు ఉన్నాయనే నెపంతో రెండేళ్లు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. ఇప్పటికీ రూ. 11 కోట్ల పంపిణీ చేయకుండా వదిలేశారు.
‘నీలం’ బాధితులకు ఇంకా కన్నీళ్లే..
2012 నవంబర్‌లో నీలంతుపాను సంభవించింది. జిల్లావ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో కుండపోత కురవడంతో పత్తి చేతికి అందకుండా పోయింది. జిల్లాలో 2,31,966 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ర్టంలోనే జిల్లాలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని ప్రకటించారు. ఇంతజరిగినా కేంద్ర బృందం జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు.
2.31 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం 27,247 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు లెక్కల్లో చూపించారు. మొత్తం 34,265 మంది రైతులకు ఈ పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అర్హులైన రైతుల్లో 29,539 మందికి రూ.9.35 కోట్లు పంపిణీ చేసి.. బ్యాంకు ఖాతాలు లేవన్న కారణంతో మిగతా రైతులకు పరిహారం అందజేయలేదు. రూ. కోట్లలో నష్టం జరిగితే నామమాత్రంగా పరిహారం పంపిణీ చేయడంపై రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.