ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు..
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ :రాష్ట్రంలో చరిత్ర పునరావృతం కాబోతోందా..? జమిలి ఎన్నికల్లో ఐదేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు వైఎస్‌కు పట్టం గట్టిన ప్రజలు ఈ సారి ఆయన తనయుడ్ని అందలం ఎక్కించనున్నారా...? అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్నలివి. గత సార్వత్రిక ఎన్నికల్లో 2009 మే 16వ తేదీన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారు. మే 20వ తేదీన రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నగదు బదిలీ పథకం అంటూ ఎన్నిక లకు వెళ్లిన టీడీపీని ప్రజలు తిరస్కరించారు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్లీ మే 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌కు పట్టం కట్టినట్టే ఆయన తనయుడికి అనుకూల ఫలితాలు రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు టీడీపీ నాయకులను మే సెంటిమెంట్ వెంటాడుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు మే నెలలో వచ్చినా ఇప్పటి వరకు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ సారి కూడా అదే పునరావృతం అవుతుదేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళనతో ఉన్నారు. ఓటరు తీర్పు ఎలా ఉండనుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.