చీరాలటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వేట తప్ప మరో పని తెలియని వీరు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధించింది. దీంతో గంగపుత్రులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. వేట నిషేధ సమయంలో సముద్రంలో చేపలు గుడ్లు పెడతాయి. దీన్ని ఆసరా చేసుకుని మత్స్యకారులకు ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం ఏటా వేట నిషేదం విధిస్తోంది.
ఆకలితో అలమటిస్తున్న మత్స్యకారులు
వేట నిషేధం సమయంలో జీవనోపాధి లేక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పూట గడవక గంగపుత్రుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో చీరాల వాడరేవు నుంచి రామాయపట్నం వరకు 102 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతంలో 74 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 22 వేల మంది సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం ఐదువేల వరకు బోట్లున్నాయి.
మూడేళ్లుగా తీరంలో వేట సజావుగా సాగటం లేదు. అకాల వర్షాలు.. తుపాన్లు, అల్పపీడనాలు వంటి పకృతి వైపరీత్యాల కారణంగా సముద్రం ఉగ్రరూపం దాల్చి అల్లకల్లోలంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు తరుచూ సముద్రంలో చిక్కుకోవటంతో మిగిలిన మత్స్యకారులెవ్వరూ ఆ రోజుల్లో వేటకు వెళ్లడం లేదు. ఈ ఏడాదైతే వేటకు వెళ్లినా చేపలు సక్రమంగా పడలేదు. ఒకటి..రెండు నెలలు తప్పా ఏడాదంతా వేట సాగ లేదు. మరో పని తెలియని మత్స్యకారులు వేటకు వెళ్లని సమయాల్లో కుటుంబ పోషణ కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నిండా మునుగుతున్నారు.
మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్న గంగపుత్రులు
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకున్నారు. వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి 31 కిలోల బియ్యం అందించాలని జీఓ కూడా జారీ చేశారు. మహానేత మరణానంతరం మత్స్యకారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కోసం ప్రభుత్వం పొదుపు పునరావాస పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న పాలకులు లేరు. వారికి అందాల్సిన ఇంధన రాయితీ కూడా నేటికీ అందలేదు. రిజిస్టర్ బోట్లకు డీజిల్ సబ్సిడీ విడుదల చేయకపోవటంతో మత్స్యకారులు ఏడాదిన్నరగా నానా అవస్థలు పడుతున్నారు.
ఉపాధి హామీ.. ఉత్తుత్తి హామీ
వేట నిషేధ సమయంలో ఉపాధి పనులు కల్పిస్తామని ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రకటించింది. ఆచరణలో అది నోచుకోలేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వేట నిషేధ సమయంలో వలలు, బోట్లు మరమ్మతులు చేసుకుంటామని, అందుకు గాను ఉపాధి కూలీలుకు ఇస్తున్న కూలే తమకూ ఇవ్వాలన్న మత్స్యకారుల డిమాండ్ చాలాకాలం నుంచి పెండింగ్‌లోనే ఉంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల అవస్థలపై చీరాల ఎఫ్‌డీవో కిషోర్‌బాబును వివరణ కోరగా మత్య్సకారులకు వేట నిషేధంలో అందించాల్సిన బియ్యాన్ని త్వరగా పంపించాలని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. బియ్యం విడుదలైన వెంటనే మత్స్యకారులకు పంపిణీ చేస్తామని వివరించారు.
మత్స్యకారులకు మొండి‘చెయ్యి’
Published Fri, May 2 2014 2:07 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement