కష్టకాలం 2013 | Tough 2013 | Sakshi
Sakshi News home page

కష్టకాలం 2013

Published Wed, Dec 25 2013 1:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Tough 2013

= కలిసిరాని 2013
 = నాలుగేళ్లుగా ఏటా నాలుగేసి తుపాన్లు
 = ఈ ఏడాది ఫై-లీన్, హెలెన్ దెబ్బ
 = నిండా ముంచిన తుపాన్లు, భారీ వర్షాలు
 = వరిలో రూ.200కోట్లకు పైగా నష్టం
 = పత్తి రైతు చిత్తరుునా ఆదుకోని యంత్రాంగం
 = పరిహారం అందజేతలో పాలకుల మీనమేషాలు

 
 కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న కర్షకుల జీవనచిత్రం గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. సాగునీరు సకాలంలో రాదు.. విత్తనాలు, ఎరువులు సమకూరవు.. పంటకొచ్చే దశలో పురుగులు, తెగుళ్లు, ఎలుకల దాడి.. వాటిని తట్టుకుని నిలదొక్కుకుంటే ప్రకృతి వైపరీత్యాలు కుదేలు చేస్తారుు. ఇలా.. దుక్కిదున్నే  దగ్గర్నుంచి పంట నూర్పిడి వరకు రైతులను అనేక సమస్యలు వ్యయప్రయాసలకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు అన్నమో రామచంద్ర.. అనే దుస్థితి దాపురించింది. జిల్లాలో దాదాపు 13.50లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలను రైతులు సేద్యం చేస్తున్నారు. 6లక్షల 42వేల ఎకరాల్లో వరిసాగు, దాదాపు 1.37లక్షల ఎకరాల్లో పత్తి, 75వేల ఎకరాల్లో చేపల చెరువులు, 35వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు, మిగిలిన ప్రాంతంలో మొక్కజొన్న, మిర్చి, వేరుశెనగ, పసుపు, సుబాబుల్, అరటి, తమలపాకులు, కూరగాయలు సాగు చేస్తున్నారు.
 
 వరుస తుపాన్లతో వరికి రూ.200కోట్ల నష్టం

 నాలుగేళ్లుగా రైతాంగాన్ని వరుస తుపాన్లు వెంటాడుతూనే ఉన్నాయి. 2010 నుంచి ఏటా నాలుగు తుపాన్లు రైతాంగాన్ని వెంటాడుతుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అకాల వర్షాలు, అక్టోబర్‌లో భారీ వర్షాలు, నవంబర్‌లో ఫై-లీన్, హెలెన్ తుపాన్లు రూ.200కోట్ల నష్టాన్ని మిగిల్చారుు. రెండున్నర లక్షల ఎకరాల్లో వరి పంట ఘోరంగా దెబ్బతినడంతో దాదాపు రెండు లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన వరి పంట మాటెలా ఉన్న పెట్టుబడిలో కనీసం 50శాతం దక్కని దయనీయ స్థితి ఎదురైంది.

 తగ్గిన దిగుబడి..

 ఈ ఏడాది వరిలో 13.90లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వర్షాలు, తుపాన్ల కారణంగా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రంగుమారి, దెబ్బతిని రైతులకు సరైన ధర రాకుండా చేసింది. మిగిలిన 9.90  లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
 ఆక్వాలో ఆటుపోట్లు

 ఈ ఏడాది ఆక్వారంగానికీ ఆటుపోట్లు తప్పలేదు. తుపాను కారణంగా ఈదురుగాలులు, మబ్బులు, వర్షాలతో ఆక్వా రంగానికి అవస్థలు తెచ్చిపెట్టాయి. జిల్లాలో సుమారు లక్షా 10వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. దీనివల్ల చేపల చెరువుల్లో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా రొయ్యల చెరువుల్లో మాత్రం నష్టాల పట్టుబడి తప్పలేదు. రొయ్యలకు ఆక్సిజన్ సమస్యలతో జిల్లాలో కలిదిండి, కైకలూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో రైతులు సుమారు రూ.50లక్షలు నష్టపోయారు. వాతవరణం అనుకూలించకపోవడంతో కొందరు రైతులు రొయ్య సైజు(కౌంట్) పెరగకుండానే పట్టుబడి పట్టి అమ్మేశారు. ఈ ఏడాది మూడు నెలలపాలు సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా నిలిచిపోయి పట్టుబడి లేకుండా చేపలు, రొయ్యలను చెరువుల్లోనే ఉంచేశారు. పెంచడానికి అధిక పెట్టుబడి కావడంతో ఆక్వా రైతులకు వ్యయప్రయూసలు తప్పలేదు.
 
 మొలకలు వచ్చిన మొక్కజొన్న.. కూరగాయల పంటకు నష్టం

 జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మొక్కజొన్న, కూరగాయ పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు 18వేల ఎకరాల్లో మొక్కజొన్న, 40వేల ఎకరాల్లో చెరకు, 25వేల ఎకరాల్లో మిర్చి, పలు మండలాల్లో కూరగాయలు, అరటి, తమలపాకుల సాగు జరుగుతోది. వర్షాల కారణంగా ఆరబెట్టిన మొక్కజొన్న తడిసి మొలకలు వచ్చాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి. అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మండలాల్లో లేతగా ఉన్న బీర, దోస, కంద పొలాల్లోకి నీరు చేరిపోవడంతో మొక్కలు చనిపోయాయి. పసుపు చేలల్లో నీరు చేరి దుంప కుళ్లిపోయింది. టమాటా చేలల్లో నీరు చేరి దెబ్బతింది. కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లోని తమలపాకుల తోటల్లో నీరుచేరి దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 
 పంట నష్టాలపై 26న నివేదిక

 వరుస విపత్తుల నేపథ్యంలో నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాం. హెలెన్ తుపాను నష్టాల నివేదికను ఈ నెల 26న ప్రభుత్వానికి అందిస్తాం. జిల్లాలో ఇటీవల హెలెన్ తుపాన్ కారణంగా నష్టపోయిన చేలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతుల జాబితాలను సిద్ధం చేశాం. ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు భారీ వర్షాలు, ఫ:-లీన్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతుల వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు అందజేశాను. తాజాగా హెలెన్ తుపాన్‌కు నష్టాలను అంచానావేసి నష్టపోయిన వరి రైతుల జాబితాలు సిద్ధం చేస్తున్నాం.
 - బాలు నాయక్, ఇన్‌చార్జి జేడీఏ
 
 అన్నదాత మరణ మృదంగం

 కష్టాల సుడిగుండంలో చిక్కిన రైతులు వ్యవసాయం చేయలేక, చేసిన అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నారు. అప్పులు రైతుల ప్రాణాలను కాటేస్తుంటే, పురుగుమందే పరమాన్నంగా, ఉరితాడే ఊయలగా రైతులు మరణమృదంగం మోగిస్తున్నారు. ఇలా 1998 నుంచి గత ఏడాది వరకు జిల్లాలో 68మంది రైతులు చనిపోగా, ఈ ఏడాది దాదాపు తొమ్మిది మంది రైతులు గుండెపోటు, ఆత్మహత్యలతో మృతిచెందారు. వీరిలో అత్యధికులు కౌలురైతులే ఉండటం గమనార్హం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతు కుటుంబాలను ఆదుకునేలా జీవో నంబర్ 321 తెచ్చి రైతు మరణాల వివరాలు కచ్చితంగా నమోదు చేసి, వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చేపట్టారు. చంద్రబాబు పాలనలోనూ, ప్రస్తుత కిరణ్ హయాంలోను రైతుల మరణాలను నమోదు చేయడంలోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆదుకునే పరిస్థితి అసలే లేదు.
 
 బాప్‌రే ‘బీపీ’టీ..

 జిల్లా రైతాంగాన్ని బీపీటీ నట్టేట ముంచింది. బీపీటీ రకాన్ని సాగుచేసిన రైతులకు కాలం కలిసిరాకపోవడంతో వారిలో మానసిక వత్తిడి పెరిగి బీపీ (రక్తపోటు) పెరిగేలా చేస్తోంది. నిద్రావస్థ లేకపోవడం, దోమ, అగ్గితెగులును తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్న బీపీటీకి మంచి ధరతో మార్కెటింగ్ సౌకర్యం ఉండటంతో రైతులు మక్కువ చూపుతున్నారు. అందుకే 1986 నుంచి దీని సాగు విస్తరిస్తోంది. జిల్లాలో గతంలో కేవలం రెండువేల ఎకరాల్లో బీపీటీ రకాన్ని సాగుచేసిన రైతులు ఈసారి ఏకంగా దాదాపు మూడు లక్షల ఎకరాల్లో సాగు విస్తరించారు. ఇటీవల వరుస తుపాన్లు, భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంట రైతులను నిండా ముంచింది. తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగుచేసిన బీపీటీ రకం పూర్తిగా దెబ్బతినగా, మిగిలిన ప్రాంతాల్లోకూ ఎకరానికి కనీసం ఐదు బస్తాల చొప్పున దిగుబడి పడిపోయింది. బీపీటీలో తగ్గిన దిగుబడితో జిల్లా రైతాంగం సుమారు రూ.10 నుంచి 15కోట్ల మేర నష్టపోయారు.
 
 పరిహారం.. పరిహాసం..

 జిల్లాలో నిండా మునిగిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోగా, పరిహాసం ఆడుతోంది. నాలుగేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతుంటే దాదాపు రెండేళ్ల కిందటి పరిహారం ఇప్పటివరకు ఇవ్వలేదు. జిల్లా రైతాంగానికి ఇప్పటికే ఇవ్వాల్సిన సుమారు రూ.33.50కోట్ల నష్టపరిహారం విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇటీవల తుపాన్లకు పంటనష్టం అంచనాలు పూర్తిచేసి పరిహారం ఇవ్వాల్సి ఉంది. నీలం తుపాను నష్టపరిహారం రూ.3.50కోట్లు, థానే తుపాన్ పరిహారం రూ.21కోట్లు, రెండెళ్లపాటు భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు సుమారు రూ.9కోట్లు మేర పరిహారం విడుదల చేయాల్సి ఉంది. ఇటీవల భారీ వర్షాలు, తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి పరిహారం అందించే విషయం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది.
 
 పత్తి రైతు చిత్తు

 జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలకు పత్తి రైతులు చిత్తయ్యూరనే చెప్పాలి. లక్షా 35వేల ఎకరాల్లో సాగు జరుగుతున్న పత్తి ప్రస్తుతం పూత, కాయ దశలో ప్రకృతి విపత్తులకు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఏడాది 20 నుంచి 25శాతం వరకు పంట దెబ్బతిన్నట్టు అంచనా. దీంతో ఎకరానికి కనీసం రెండు క్వింటాళ్ల పత్తి పంటను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు కోటి రూపాయలకు పైగా పత్తి రైతులు పెట్టుబడులే నష్టపోయారు. పత్తి పంటలో కనీసం 50శాతం మేర నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలన్న నిబంధన.. జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన పత్తిరైతుకు శరాఘాతంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement