సాక్షి, గుంటూరు : ‘‘జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కాలువలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అధికారులను అడిగి వివరాలు తీసుకుంటున్నాం. జిల్లా నుంచి అందిన వరద నష్టం అంచనాలు సరిగ్గా ఉన్నాయో, లేదో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. జిల్లా రైతులకు అన్యాయం జరగకుండా కేంద్రం నుంచి సజావుగా నష్టపరిహారం అందేలా నివేదిక అందజేస్తాం’’ మంగళవారం జిల్లాలో వరద నష్టాలను పరిశీలించిన కేంద్రబృందం చెప్పిన మాటలివి.
ఉదయం 11 గంటలకు గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశ మైన కేంద్ర బృంద సభ్యులు వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, గ్రామీణ నీటి సరఫరా వంటి ప్రధాన శాఖలకు భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శంభూసింగ్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పర్యటించి కిందటి నెలలో వానల వల్ల జరిగిన నష్టాలను పరిశీలిస్తున్నామన్నారు. పంట నష్టం అంచనాలు పారదర్శకంగా జరిగినట్లు భావిస్తున్నామనీ, అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెలాఖరు కల్లా రైతులకు నష్ట పరిహారం అందే వీలుంటుందన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ప్రభుత్వానికి పంపిన నష్టం నివేదికల మేరకు వరద నష్టం ఉందో, లేదో చూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ వి.శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 5.86 లక్షల హెక్టార్లలో వరి సాగు లో ఉంటే, 1.44 లక్షల హెక్టార్లలోని పంట దెబ్బతిందన్నారు.
ప్రధానంగా బాపట్ల ఏరియాలోని 50 వేల హెక్టార్లలో పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. వరదనీరు ఐదారు రోజుల పాటు పొలంలోనే ఉండటంతో వరి దుబ్బు కుళ్లిపోయి కొన్ని చోట్ల పంట పాడైందన్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారన్నారు. రెండో పంట సాగు నిమిత్తం రైతులకు 60 టన్నుల విత్తనాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా జిల్లాలోని 91 వేల హెక్టార్లలోని పత్తి పంటకు కూడా నష్టం జరిగిందన్నారు. డీఆర్‌వో నాగబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3,330 ఇళ్లు దెబ్బతిన్నాయనీ, 77 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 6,840 కుటుంబాలకు ఆశ్రయం కల్పించామన్నారు. బాధితులకు కిరోసిన్, బియ్యం పంపిణీ చేశామనీ, ఇందుకోసం ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.3.41 కోట్లను విడుదల చేసిందన్నారు.
జిల్లా ఆర్ అండ్ బీ ఎస్‌ఈ రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 3,400 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు ఉండగా, 775 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయన్నారు. 16 రోడ్లకు 22 చోట్ల పెద్ద ఎత్తున గండ్లు పడ్డాయనీ, వీటిని బాగు చేయాలంటే రూ. 258 కోట్లు అవ సరమవు తాయన్నారు. ఇదేవిధంగా ఇరిగేషన్ ఎస్‌ఈ రమేష్‌బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ రాజారావు, ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ షుకూర్ తదితరులు తమతమ శాఖల వారీగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు.
జిల్లాలో రైతులకు ఎదురైన నష్టం పూడ్చలేనిదనీ, ఏదిఏమైనా పారదర్శకంగా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. సమీక్షకు ముందు కేంద్ర బృందంలోని సభ్యులు శంభూసింగ్, ఆర్‌పీ సింగ్, ఎం. రమేష్‌కుమా ర్‌లు జెడ్పీ వరండాలో వరద నష్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వివిధ చోట్ల కాలువలు, డ్రెయిన్లకు పడ్డ గండ్లు, మునిగిపోయిన పంటలపై జేడీఏ శ్రీధర్, ఇరిగేషన్ ఎస్‌ఈ రమేష్‌బాబులు బృందానికి వివరించారు.
రైతులకు అన్యాయం జరగదు
Published Wed, Nov 20 2013 3:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement