జగన్‌కు శరద్‌పవార్ హామీ
నేడు, రేపు గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన
పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజల కడగండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించేందుకు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడగ ట్టడంలో భాగంగా జగన్ సోమవారం మధ్యాహ్నం ముంబయిలో పవార్‌ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో తుపానుల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రైతుల దుస్థితికి సంబంధించిన వివరాలను సావధానంగా తెలుసుకున్న పవార్ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందజేయడానికి ప్రయత్నిస్తానని జగన్‌కు హామీ ఇచ్చారు. ఇలావుండగా జగన్ మంగళవారం నుంచి తుపాను తాకిడికి గురై నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు తూర్పుగోదావరి, రెండోరోజు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన నష్టాన్ని పరిశీలిస్తారు. బాధిత రైతాంగాన్ని పరామర్శిస్తారు. జగన్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుంటారు. కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం రాత్రికి నర్సాపురంలో బస చేస్తారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారు.