సంపాదకీయం: వచ్చిపడుతున్న వరస విపత్తులతో రాష్ట్రం కుదేలవుతోంది. ఒకటా, రెండా... నాలుగేళ్ల నుంచి రైతును అతివృష్టి లేదా అనావృష్టి నిలువునా కుంగదీస్తున్నాయి. తుపానులు, అల్పపీడనాలు, వాయుగుండాలు భారీ వర్షాలను మోసుకొస్తూ పంటపొలాలను ఊడ్చి పెడుతున్నాయి. ఊళ్లన్నీ వరదల్లో తేలియాడుతున్నాయి. ఆమధ్య వచ్చిన నీలం తుపాను, నిన్న మొన్నటి పైలీన్, మధ్యన వాయుగుండం... ఇలా ఒకదాని తర్వాత మరోటి రైతులను దెబ్బతీశాయి. ఇప్పుడు హెలెన్ పెను తుపాను తన వంతు నష్టాన్ని మిగిల్చి వెళ్లింది. గత నాలుగురోజులుగా కోస్తా తీరంలో లంగరేసి భయపెడుతున్న హెలెన్ శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం సమీపంలో తీరందాటుతూ ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు పెను విషాదాన్ని మిగిల్చింది.
భయపడినదానితో పోలిస్తే తీవ్రత కాస్త తక్కువున్న మాట వాస్తవమే అయినా ఇది చేసిన నష్టం తక్కువేమీ కాదు. వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోయారు. చాలాచోట్ల వేలాది ఇళ్లు కూలిపోవడంతోపాటు లక్షలాది ఎకరాల్లో వరి, అరటి, కొబ్బరి, కూరగాయ పంటలకు భారీ నష్టం సంభవించింది. చేతికొస్తాయనుకున్న పంటలన్నిటినీ హెలెన్ తుడిచిపెట్టేసింది. రోడ్లన్నీ తెగిపోయి రవాణా సదుపాయలు దెబ్బతినడంతోపాటు వేలాది గ్రామాలకు విద్యుత్ సదుపాయం దెబ్బతింది. బంగాళాఖాతంలో మరో తుపాను పొంచివున్నదని, ఇప్పటికి అల్పపీడనంగా ఉన్న ఆ మహమ్మారి వాయుగుండంగా మారి తుపానుగా విరుచుకుపడే ప్రమాదమున్నదని వెలువడుతున్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
మూడువైపులా సముద్రాలున్న మన దేశానికి తుపానులు, వాయుగుండాలు, అల్పపీడనాలు సహజీవనం చేయకతప్పని, భరించకతప్పని వైపరీత్యాలు. వాటిని నివారించడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. చురుకైన ప్రభుత్వాలుంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని నష్టాన్ని కనిష్ట స్థాయికి తెస్తాయి. ప్రజలకు వచ్చిపడిన కష్టాలను తీర్చడానికి ప్రయత్నిస్తాయి. తిరిగి సాధారణ జీవనం కొనసాగించడానికి ఆసరాగా నిలుస్తాయి. సరిగ్గా ఇక్కడే మన ప్రభుత్వాలు జనాన్ని దగాచేస్తున్నాయి. తుపానులొచ్చినా, వరదలొచ్చినా, కరువులొచ్చినా హామీలివ్వడంతప్ప ఆచరణలో చేసేదేమీ ఉండటంలేదు. అరకొర సాయం... అదికూడా ఏడాదో, ఏణ్ణర్ధమో గడిచాక విదిలించి తమ బాధ్యత తీరిందన్నట్టు ప్రవర్తిస్తున్నాయి.
రైతు ఆరుగాలం శ్రమపడి పండిస్తేనే దేశం పచ్చగా ఉంటుంది. ప్రజలందరికీ నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్తాయి. ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు అయిదేళ్లక్రితం రూ.80,000 కోట్లు ఉంటే అదిప్పుడు మూడురెట్లు పెరిగింది. ఇదంతా ప్రకృతితో నిత్యం పోరాడుతూ రైతులు సాధిస్తున్న విజయం. దేశాభివృద్ధికి వ్యవసాయరంగం ఇంతగా తోడ్పడుతున్నా కష్టాల్లో ఉన్నప్పుడు కన్నెత్తి చూసే తీరిక పాలకులకు ఉండటంలేదు. ప్రకృతి కన్నెర్రజేసినప్పుడు కూడా గుండె దిటవుచేసుకుని ముందుకే వెళ్దామని ప్రయత్నించే రైతులు ఈ వైఖరితో ఉస్సూరంటున్నారు. అప్పుల భారంతో కుంగిపోతున్నారు. తాము పంపే అధికారుల బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్రం ప్రకటించే సాయం రైతులను దిగ్భ్రాంతిపరుస్తోంది.
ఆ సాయమైనా ఏళ్లూ పూళ్లూ గడిచినా ఆచూకీ ఉండటంలేదు. నిరుడు నీలం తుపాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రులు ప్రభావిత జిల్లాలకు వెళ్లి ఓదార్చారు. ఆదుకుంటామని, తగిన సాయం అందిస్తామని ఊరడించారు. ఏడాది గడిచింది. ఇప్పటికీ ఆ తుపానులో నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయమూ అందలేదు. గత నెలలో వచ్చిన పైలీన్ తుపాను, భారీ వర్షాలవల్ల దాదాపు 33 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని ప్రభుత్వమే చెప్పింది. నీలం తుపాను బాధితులకే సాయం అందని నేపథ్యంలో పైలీన్ వల్ల నష్టపోయినవారికిచ్చే పరిహారం గురించి ఆలోచించే పరిస్థితే లేదు. ఇప్పుడొచ్చిన హెలెన్ తుపానుకు నీట మునిగిన వ రి విస్తీర్ణమే 15 లక్షల ఎకరాలకు పైగా ఉంటుందంటున్నారు. కోతకోసి కుప్పబోసిన పంట, కోతకు సిద్ధంగా ఉన్న పంట కూడా నీటిపాలయ్యాయి. ఇదిగాక వేలాది ఎకరాల్లో కొబ్బరి, అరటి, మినుము, పెసర పంటలు నాశనమయ్యాయి.
వైపరీత్యాలు సాధారణమైనప్పుడు సాయం అందజేసే యంత్రాంగమూ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేయాలి. కానీ, ఆ పని జరగడంలేదు. ఫలితంగా వెనువెంటనే వచ్చి చూడాల్సిన కేంద్ర బృందాలు అంతా అయి, సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక తీరిగ్గా వస్తున్నాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టానికి సంబంధించి మదింపువేసి గణాంకాలు అందజేశాక కదులుతున్నాయి. తమ వంతుగా లెక్కలేవో వేస్తున్నాయి. ఆ నివేదికల ఆధారంగా కేంద్రం ప్రకటించే సాయం ఏమూలకూ చాలని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంటల బీమాపథకం ఉన్నా వాస్తవ నష్టానికీ, దానిద్వారా అందే సాయానికీ పొంతన ఉండటంలేదు. నష్టపరిహారం లెక్కించే విధానంలో ఉన్న లోపమే ఇందుకు కారణమని రైతులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా పథకాన్ని సరిదిద్దే నాథుడు కనబడటంలేదు.
వర్షాకాలానికి ముందు కాల్వలు, చెరువుల గట్లు పటిష్టపరుద్దామనిగానీ, పంట కాల్వల పూడిక, డ్రెయిన్ల పూడిక తీయిద్దామనిగానీ పాలకులకు తోచడంలేదు. ఫలితంగా కొద్దిపాటి వర్షాలకే పంటపొలాలన్నీ చెరువులవుతున్నాయి. ఇక తుపానులు వచ్చినప్పటి స్థితి గురించి చెప్పేదేముంది? అభివృద్ధికి దన్నుగా నిలుస్తున్న వ్యవసాయ రంగాన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ పోతే ప్రమాదకర పర్యవసానాలు ఏర్పడతాయని పాలకులు గుర్తించడంలేదు. అన్నివిధాలా దగాపడి, సేద్యం తమవల్ల కాదంటూ ఇప్పటికే చాలామంది రైతులు నిష్ర్కమిస్తున్నారు. ఈ పరిస్థితిని కాస్తయినా చక్కదిద్దగలిగినప్పుడే తమ కర్తవ్యాన్ని నిర్వర్తించిన వారమవుతామని, రైతన్నల రుణం తీర్చుకున్నవారమవుతామని పాలకులు గుర్తించాలి.