
రైతాంగాన్ని ఆదుకోని అల్పపీడనాలు...
ఇంకా లోటు వర్షపాతమే
ఖరీఫ్ సాగుకు ఉపయోగపడని వానలు
ఈసారి గణనీయంగా పెరిగిన సోయా, ఉల్లి
మహబూబ్‌నగర్ మినహా అన్ని జిల్లాల్లోనూ వర్షాభావమే...
హైదరాబాద్: ఈ సీజన్‌లో తెలంగాణలో సాధారణంగా 715 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇటీవల వరకు ఒకమోస్తరు భారీవర్షాలు కురిసినా, అల్పపీడ నం వల్ల వర్షాలు పడినా కేవలం 444.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతంతో రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కోకతప్పడం లేదు. గత ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 10వ తేదీవరకు 746.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ తప్ప మిగతా 9 జిల్లాల్లో తక్కువగా వర్షపాతం నమోదయింది. కరీంనగర్‌లో 44 శాతం, వరంగల్‌లో 40 శాతం, ఖమ్మం, మెదక్‌జిల్లాల్లో 36 శాతం, నల్లగొండ,నిజామాబాద్ జిల్లాల్లో 34 శాతం, ఆదిలాబాద్‌లో 33 శాతం, రంగారెడ్డి జిల్లాలో 20శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. అల్పపీడనాల కారణంగా అక్కడక్కడ వర్షాలు పడినా ఖరీఫ్‌కు ఇవి ఉపయోగపడే అవకాశాలు కనిపించడం లేదు.
తగ్గిన పప్పుధాన్యాలసాగు: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో పప్పుధాన్యాల సాగు భారీగా పడిపోయింది. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్‌లో 2.89 లక్షల హెక్టార్లలో కంది సాగు కావాల్సి ఉండగా, 2.29 హెక్టర్లకు పరిమితమైంది. పెసర 1.53 లక్షల హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా, 80 వేలహెక్టార్లలో సాగుచేశారు. మినుములు 46,500 హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా కేవలం 23 వేల హెక్టార్లలో సాగైంది. ఉలువలు 1100 హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా, వంద హెక్టార్లకే పరిమితమైంది. మొత్తానికిరాష్ట్రంలో 4.92 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుదినుసులు సాగుకు అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా దానిలో 68 శాతం అనగా... 3.34 హెక్టార్లలో పప్పుదినుసులు సాగయ్యాయి.
సోయాబిన్,ఉల్లిసాగులో వృద్ధి: రాష్ర్టంలో ఏడాదికి ఏడాది సోయా చిక్కుడు సాగు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో 1.61 లక్షల హెక్టార్లలో సోయా సాగు కావాల్సి ఉండగా ఏకంగా 1.68 లక్షల హెక్టార్లలో వేశారు. అదేవిధంగా ఈ ఏడాది ఉల్లిసాగులో వృద్ధి చోటుచేసుకుంది.