తూర్పు గోదావరి జిల్లా కాకినాడ – తాళ్లరేవు రోడ్డులో తుపాను గాలులకు ఊగిపోతున్న కొబ్బరి చెట్లు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: సాధారణంగా తుపాన్లు సముద్ర తీర ప్రాంతంలో భూమిని తాకుతాయి. భూ ఉపరితలంపై కొద్ది దూరం ప్రయాణించాక బలహీనపడిపోతాయి. కానీ, సోమవారం తూర్పు గోదావరి తీరాన్ని తాకిన పెథాయ్ తుపాను మిగతా వాటికి భిన్న మైనది. ఇది తీరాన్ని దాటిన తర్వాత దిశను మార్చుకొని, సముద్రంలోకి వెళ్లింది. మళ్లీ రాత్రికి తూర్పుగోదావరిలోని తుని వద్ద రెండో సారి తీరాన్ని తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెథాయ్ తొలుత సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కాట్రేనికోన – యానాంల మధ్య సోమవారం మధ్యాహ్నం తీరాన్ని దాటింది.
వాస్తవానికి తుపాను తీరాన్ని దాటి భూమిపైకి వచ్చాక బలహీనపడుతుంది. అంతా అలాగే అనుకున్నారు. కానీ కాసేపటికే దిశను మార్చుకొని యానాం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వెళ్లింది. సముద్రం మీదుగా ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా బలహీనపడి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కాకినాడకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ సోమవారం రాత్రి తుని వద్ద రెండోసారి తీరాన్ని తాకింది. ఇలా ఒకే తుపాను రెండుసార్లు భూమిని తాకడం చాలా అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సముద్ర తీరం వంపు కలిగి ఉండటం, తుపాను తన దిశను వేగంగా మార్చుకోవడం వల్ల ఈ విధంగా జరిగిందని నిపుణులు చెబుతున్నారు.
ఇది చాలా అరుదు
ఇలాంటి ఘటనలు దశాబ్దాల తర్వాత సంభవిస్తుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు నెలలో ఉపరితల గాలుల ప్రభావం వల్ల తుపానులు తీరం దాటాక కూడా దిశ మార్చుకోవడంతో ఇలాంటి పరిస్థితులేర్పడతాయని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. 1970 దశకంలో ఇలాగే జరిగిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు వివరించారు. ‘సాధారణంగా తుపాను ఒకసారే తీరం దాటుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే తుపాను రెండుసార్లు కూడా తీరం దాటుతుంది. తాజాగా వచ్చిన ‘పెథాయ్’ కూడా అలాగే దాటింది. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇందుకు కారణం. పెథాయ్ తుపాను కాకినాడ – యానాం మధ్య తీరం దాటింది. ఈ ప్రాంతంలో భూమి ఆంగ్ల అక్షరం తిరగబడిన ‘యు’ ఆకారంలో సముద్రం లోపలకు ఉండి తిరిగి వెలుపలకు ఉంది. భూమి సముద్రం లోపలకు ఉన్న ప్రాంతంలో తుపాను తీరం దాటి అదే మార్గంలో వెళ్లడంతో మళ్లీ సముద్రంలోకి వెళ్లినట్లయింది. కొద్దిదూరం పోయిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి మరోసారి తీరాన్ని దాటింది. ఇలా అరుదుగా జరుగుతుంటాయి’ అని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం అధికారులు వైకే రెడ్డి, నాగరత్న ‘సాక్షి’కి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment