ఒకేసారి రెండు వాయుగుండాలు
రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఊపందుకోనున్న వర్షాలు
కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకెళ్లొద్దని భారత వాతావరణ విభాగం హెచ్చరిక
విశాఖపట్నం: దేశంలో ఇప్పుడు రెండు వాయుగుండాలు ప్రభావం చూపుతున్నాయి. వీటిలో ఒకటి ఈశాన్య బంగాళాఖాతంలోను, మరొకటి నైరుతి రాజస్థాన్‌కు ఆనుకుని గుజరాత్‌పైన కొనసాగుతున్నాయి. ఇలా ఒకేసారి రెండు వాయుగుండాలు ఏర్పడటం అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కదులుతోంది. ఇది రెండ్రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారి ఏపీలోని ఉత్తర కోస్తాపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ చెదురుమదురు వానలు కురుస్తున్నాయి. దీనికి వాయుగుండం కూడా తోడవడంతో 30, 31, ఆగస్టు 1 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నాటి బులెటిన్‌లో తెలిపింది.
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. ఒడిశా, బెంగాల్ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశ నుంచి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు స్థానిక ప్రమాద సూచికను ఎగురవేశారు. మరోవైపు నైరుతి రాజస్థాన్ వద్ద కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరో రెండ్రోజుల్లో బలహీనపడనుంది.