సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఆగస్టులో కురిసిన వర్షాలు.. కృష్ణా, గోదావరికి పోటెత్తిన వరదలు ఖరీఫ్‌లో రాష్ట్ర రైతన్నలను ఆదుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడొంతుల సాగు భూమిలో విత్తనాలు జీవం పోసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వరి సాగు వెనుకంజలో ఉండగా రాష్ట్రంలో మాత్రం బాగా పుంజుకోవడం విశేషం. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాట్లు ఈ నెలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. సాగర్ కుడి, ఎడమ కాలువల కింద వరి సాగు ఈ నెలలో మొదలవుతుంది. గత పదేళ్లలో తొలిసారిగా నాగార్జునసాగర్ నిండుకుండలా మారడంతో ఈసారి ఆలస్యంగానైనా కుడి కాలువ కింద దాదాపు 11 లక్షల ఎకరాలకు పైగా మాగాణుల్లో నాట్లు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు.
అన్నదాతలకు ఇవీ సూచనలు...
- సాధ్యమైనంత వరకు లేత నారు అంటే 25– 30 రోజుల లోపల ఉన్న వరి నారు నాటుకోవాలి.
- ముదురు నారు నాటాల్సి వస్తే నాట్లు దగ్గర దగ్గరగా వత్తుగా ఉండేలా చూడాలి.
- ఆలస్యంగా సాగు నీరు అందిన ప్రాంతాల్లో స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది.
- స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ 1153, ఎంటీయూ 1156, ఎన్ ఎల్ ఆర్ 34449, మధ్యకాలిక రకాలైతే ఎంటీయూ 1075, ఎంటీయూ 1121, ఎన్ ఎల్ ఆర్ 304 సాగుకు అనువైనవి.
- వెదజల్లే పద్ధతిలో కలుపు నివారణకు విత్తిన 3 నుంచి 5 రోజుల మధ్య ఎకరానికి ఆక్సాడయర్జిల్ 35 గ్రాములను 25 కిలోల పొడి ఇసుకతో కలిపి సమానంగా చల్లాలి. విత్తిన 810 రోజుల మధ్య ఎకరానికి ఫైరజోసల్ఫ్యురాన్ ఇధైల్ లీటర్ నీటికి వంద గ్రాములు లేదా ఇథాక్సిలస్ఫ్యురాన్ 40 గ్రాములను 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 రోజులకు ఎకరానికి సైహాలోఫాప్ బ్యూటైల్ పది శాతం ద్రావకాన్ని 400 మిల్లీలీటర్లు లేదా బిస్పైరిబాక్ సోడియం పది శాతం ద్రావకాన్ని వంద మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందును పిచికారీ చేయాలి.
- వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలుంటే విత్తిన 20 – 25 రోజుల లోపు ఎకరానికి 400 గ్రాముల డి.సోడియం సాల్ట్ 80 శాతం పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- వర్షాల కారణంగా జొన్నలో గింజ బూజు తెగులు లేదా బంక కారు తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 0.5 మిల్లీలీటర్‌ను లీటర్ నీటిలో కలిపి పూత, గింజ దశలో పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. సజ్జను కూడా జొన్న మాదిరిగా సస్యరక్షణతో కాపాడుకోవచ్చు.
- మినుము, పెసరలో తెగుళ్ల నివారణకు ఎపిఫేట్మో, మోనోక్రోటోఫాస్, ఫిప్రోనిల్, డైమిథోయేట్, స్పైనోసాడ్లలో ఏదో ఒకదాన్ని వ్యవసాయాధికారుల సూచన మేరకు పిచికారీ చేయాలి. ఒక అడుగు ఎత్తులో నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 20 వరకు ఉంచితే తామర పురుగులు ఉధృతిని తెలుసుకోవచ్చు.
- పల్లాకు తెగులు సోకిన పొలంలో పైరుపై ఒక అడుగు ఎత్తులో పసుపు రంగు రేకులు లేదా అట్టలను ఉంచి వాటిపై ఆముదం లేదా గ్రీజు రాయడం ద్వారా తెల్ల దోమ ఉధృతిని తెలుసుకోవచ్చు. తెల్ల దోమ నివారణకు ట్రైజోఫాస్, మోనోక్రోటోఫాస్, మెటాసిస్టాక్స్, ఎసిటామిప్రిడ్ లీటర్ నీటికి కలిపి పురుగు ఉధృతిని బట్టి 7 నుంచి పది రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారీ చేయాలి. పల్లాకు తెగులు సోకిన మొక్కల్ని తొలగించడం మంచిది.
- మినుము, పెసర పూత దశలో ‘మారుక’ గూడు పురుగు నివారణకు లీటర్ నీటికి క్లోరిఫైరిఫాస్ డైక్లోరివాస్ లేక నొవల్యురాన్‌ను పిచికారీ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment