
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలో ఎప్పుడూ లేనంతగా భానుడు మరింత భగభగమంటున్నాడు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులు రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరో రెండు మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి ఉంటుంది. సాధారణంకంటే ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగాను, అంతకుమించి రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. కానీ, కోస్తాంధ్రలో ఇప్పటికే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమ, మంగళవారాలు అంతకు మించి ఉష్ణోగ్రతలు రికార్డయి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. దీంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర నిప్పుల కుంపటిలా మారనుంది.రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2–4 డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని సూచించింది.
ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాలు
కాగా, ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. దీంతో ఈనెల 18 తర్వాత నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంవల్ల మూడు నాలుగు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అప్పట్నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునే అవకాశాలున్నాయి. మరోవైపు.. నైరుతీ రుతుపవనాలు నైరుతీ, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించినట్లు హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు, మైసూరు, తమిళనాడులోని సేలం, కడలూరు, ఒడిశాలోని గోపాలపురం, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ వరకు నైరుతీ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.