
సాక్షి, హైదరాబాద్: రాజస్థాన్, కచ్, ఉత్తర అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాల నుంచి శనివారం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో రాజస్థాన్‌లో మిగిలిన ప్రాంతాలు సహా పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది.
నైరుతి సీజన్ మొదలైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో సరాసరి సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది. సాధారణంగా ఈ కాలంలో తెలంగాణలో 754.7 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 741.4 ఎంఎంలు రికార్డు అయినట్లు తెలిపింది. పది జిల్లాల్లో లోటు వర్షపాతం, ఐదు జిల్లాల్లో అధికం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మొత్తంగా నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ముగుస్తున్నట్లు పేర్కొంది.
నేడు రాష్ట్రంలో వర్షాలు..
శ్రీలంక నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment