
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈసారి రాష్ట్రాన్ని ముందే పలకరించనున్నాయి. రుతుపవనాలు ఈ నెల 29న కేరళను తాకే అవకాశముందని.. వచ్చే నెల తొలి వారానికల్లా తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ పదో తేదీన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. గతేడాది జూన్ 12న వచ్చాయి. అదే ఈసారి ఐదారు రోజుల ముందుగానే.. 4వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య రాష్ట్రానికి చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.
కేరళలోకి ముందే..
మొత్తంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాక, విస్తరణ అంచనాలను భారత వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీన కేరళలోకి ప్రవేశిస్తాయి. గతేడాది మే 30న ప్రవేశించగా.. ఈసారి 29నే వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు మే 23 నుంచి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పురోగమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించింది.
సాధారణ వర్షపాతమే..
సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే దీనిని సాధారణ వర్షపాతంగానే పరిగణనలోకి తీసుకుం టామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో నైరుతి సీజన్ సాధారణ వర్షపాతం 755 మిల్లీమీటర్లుకాగా.. 97 శాతం లెక్కన ఈసారి 732 మిల్లీమీటర్లు కురిసే అవకాశముంది.
అయితే వాతావరణ శాఖ గతేడాది నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించినా.. 87 శాతమే కురిసింది. అదే 2016లో మాత్రం సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక రుతుపవనాలు ఒక్కోసారి ప్రవేశించిన వెంటనే రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా ఒకేసారి విస్తరించాయి.