నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం భట్టుగూడెంలో సరిగా మొలవని పత్తి చేను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వానాకాలం మొదలై దాదాపు నెలన్నర కావొస్తున్నా, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి మూడు వారాలు దాటినా ఎక్కడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. జూన్‌లో వానల జాడే లేక పోగా.. జూలైలో అక్కడక్కడా చిరుజల్లులు, మోస్తరు వానలు మాత్రమే కురుస్తున్నాయి. భారీ వర్షాల ఊసే లేదు. దీనితో పంటల సాగుకు అదును దాటిపోతుండగా.. సీజన్‌పై ఆధారపడ్డ ఇతర రంగాలు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నాయి.
గత మూడేళ్లుగా సమృద్ధిగా వానలు పడ్డాయని.. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొందని, ఇది కరువు తరహా పరిస్థితులకు సంకేతమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది.
వ్యవసాయం,సాగునీటితోపాటు పలు ఇతర శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా భేటీ అయిన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కరువు పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే 30శాతం లోటు
సాధారణంగా మే నెలాఖరు లేదా జూన్ తొలివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి జూన్ మూడో వారంలో రాష్ట్రాన్ని తాకాయి. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతటా విస్తరించడంతో.. వానలు ఆశాజనకంగా ఉంటాయని తొలుత భావించినా, తర్వాత ఆ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడగా.. మిగతా ప్రాంతాల్లో అడపాదడపా తేలికపాటి వానలు మాత్రమే కురుస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో లోటు ఉంది. రాష్ట్రంలో సాధారణంగా నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు(జూలై 10వ తేదీ వరకు) సగటున 19.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 13.49 సెంటీమీటర్ల మేర మాత్రమే కురిసింది. అంటే 30శాతం లోటు ఉంది. ఇందులోనూ కొన్ని జిల్లాల్లో తీవ్రమైన లోటు ఉంది.
కొనసాగుతున్న లోటు..
జూన్ నెలలో రాష్ట్రంలో సగటున 12.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 7.20 సెంటీమీటర్లు అంటే 55.68 శాతమే వర్షం మాత్రమే కురిసింది. జూలైలో ఇప్పటివరకు 6.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణమే అయినా.. ఇప్పట్లో వానలు పడే అవకాశాలు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలకరి వానలతో సాగు మొదలుపెట్టిన రైతులు ఆందోళనలో పడ్డారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులు
రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో వర్షాలు ఆశించినంతగా లేవు. 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ జిల్లాల్లోనూ కొన్నిప్రాంతాలకే వానలు పరిమితం అయ్యాయని అధికారులు చెప్తున్నారు. మిగతా 23 జిల్లాల్లో లోటు, అత్యంత లోటు వర్షపాతమే ఉన్నట్టు వివరిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలపై కసరత్తు
లోటు వర్షపాతం కొనసాగితే ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఉన్నతాధికారులు వివిధ రంగాలు, అంశాల వారీగా పడే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment