
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఉండగా.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. వాయవ్య జార్ఖండ్ పరిసరాలపై ఉన్న ఈ అల్పపీడనం ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లపై ఉంది. కొత్తగా ఏర్పడనున్న అల్పపీడనం ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపుగా కదులుతుందని, దీని ప్రభావం మన రాష్ట్రంపై ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలకు , దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గింది. పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో రుతుపవనాల పురోగతి నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment