
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరణ స్ధిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బుధవారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం భారత ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతు పవనాల రాక ప్రారంభమైంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది.