
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంతో పోల్చితే ఇప్పటికే వారం, పది రోజులకుపైగా ఆలస్యంకాగా.. నైరుతి ఆగమనానికి మరో వారం వరకూ సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 20–22వ తేదీ నాటికి రావొచ్చని పేర్కొంటోంది.
ఇది గత పదేళ్లతో పోల్చితే ఏకంగా పది, పన్నెండు రోజులు ఆలస్యం కావడం గమనార్హం. రుతుపవనాలు రాకపోవడంతో వానలు పడక వ్యవసాయంపై ప్రభావం పడు తోంది. పంటల సాగు మొదలుపెట్టేందుకు జాప్య మవుతోందని, ఇలాగైతే పంటల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యంగా వచ్చి.. మందకొడిగా మారి..
ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తర్వాత క్రమంగా తమిళనాడుతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఆ తర్వాత మందకొడిగా మారిపోయాయి. రుతుపవనాలు చురుకుగా కదిలేందుకు బంగాళాఖాతంపై నెలకొనే వాతావరణ పరిస్థితులే కీలకం.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి, అల్పపీడనాలు వంటివి ఏర్పడితే రుతుపవనాలు వేగంగా వ్యాప్తి చెందుతాయని అధికారులు చెప్తున్నారు. కానీ ఈసారి బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులేవీ నెలకొనలేదని.. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను ప్రభావంతో నైరుతి మందకొడిగా మారిందని అంటున్నారు.
ఇంతకు ముందు కాస్త లేటయినా..
నైరుతి రుతుపవనాలు మే చివరివారం నుంచి జూన్ తొలివారం మధ్య కేరళలో ప్రవేశిస్తాయి. తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. అల్పపీడనాలు, తుఫానులు వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రుతుపవనాల కదలికలు ఉంటాయి. గత పదేళ్లలో రుతుపవనాల రాకను పరిశీలిస్తే 2014, 2016, 2019 సంవత్సరాల్లో ఆలస్యంగా వచ్చాయి.
చివరిసారిగా 2019లో లేటుగా ప్రవేశించినా.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, వేగంగా పది రోజుల్లోనే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలకు విస్తరించాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
► ప్రస్తుతం ఈనెల 8న కేరళను తాకిన రుతుపవనాలు తదుపరి మూడు రోజుల్లోనే తమిళనాడు, ఏపీ, కర్ణాటకల్లోకి ప్రవేశించాయి. ఈ నెల 15 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తొలుత అంచనా వేశారు. కానీ రుతుపవనాల కదలిక మందకొడిగా ఉందని.. తెలంగాణలోకి రావడానికి మరో వారం పడుతుందని వివరిస్తున్నారు. తొలకరి వానల కోసం ఎదురుచూడక తప్పదని అంటున్నారు. రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒకట్రెండు వర్షాలకే విత్తనాలు నాటితే.. సాగుకు అనుకూలించే అవకాశాలు తక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రత.. ఉక్కపోత..
నైరుతి మందగమనంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగానే నమోదవుతున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తగ్గిపోతాయి. కానీ ఈసారి చాలాచోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత కొనసాగుతోందని.. ఈ పరిస్థితి మరో వారంపాటు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment