సాక్షి, అమరావతి/తిరుమల: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. రుతు పవనాలు కేరళను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ నెల 8వ తేదీన అవి కేరళలో ప్రవేశించగా.. 12వ తేదీ నాటికి ఏపీకి వస్తాయని భావించారు. కానీ.. బిపర్‌జోయ్ తుపాను కారణంగా అవి చురుగ్గా కదలడంతో ఒకరోజు ముందుగానే ఏపీని తాకాయి.
ఆదివారం తిరుపతి జిల్లా శ్రీహరికోట మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి. వచ్చే 48 గంటల్లో అవి రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది.
మరో వారం ఎండల తీవ్రతే
రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. అంటే మరో వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాలులు ఉండనున్నాయి. సోమవారం 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇదిలావుండగా ఆదివారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి, కాకినాడ జిల్లా కరప, విజయనగరం జిల్లా జామిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ జిల్లా పద్మనాభంలో 44.7, మన్యం జిల్లా భామిని, కోనసీమ జిల్లా శివలలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 86 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 110 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి.
మబ్బుల ‘సన్’దడి
తిరుమలలో ఆదివారం ఉదయం నుంచే నీలాకాశం మబ్బులతో నిండిపోయింది. వెండి మబ్బులు దోబూచులాడుతూ భానుడితో ఆటలాడడం ప్రారంభించాయి. సాయంత్రానికి మరిన్ని మబ్బులు చేరి సందడి చేశాయి. దాదాపు రెండు నెలలపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment