వాన చినుకుల మధ్య తిరుమల ఆలయం
సాక్షి,అమరావతి/నెట్‌వర్క్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నాయి. శుక్రవారం రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు శనివారం నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాలను తాకాయి. శనివారం రాత్రికి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించే వీలుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఇదే వేగం కొనసాగితే రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పారు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపారు.
వేగంగా కదులుతున్న రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత మన రాష్ట్రాన్ని తాకేందుకు సాధారణంగా ఐదు రోజుల సమయం పట్టేది. రాష్ట్రమంతా వ్యాపించడానికి కనీసం 10 నుంచి 15 రోజుల సమయం పట్టేది. కానీ ఈ సంవత్సరం కేరళను తాకిన 24 గంటల్లోపే మన రాష్ట్రంలోనూ రుతుపవనాలు విస్తరించాయి. రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించే పరిస్థితి నెలకొంది. యాస్ తుపాను, ఇతర వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాలు చల్లబడిపోవడం రుతుపవనాలకు అనుకూలించిందని, దీంతో కేరళను తాకిన తర్వాత రుతుపవనాలు అత్యంత వేగంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది.
పలుచోట్ల వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో శనివారం రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి, తిరుమలతోపాటు తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లో శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఏకధాటిగా కుండపోత వానపడింది. అనంతపురం జిల్లాలోని 58 మండలాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నల్లచెరువులో 65.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వరికుంటపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో పిడుగుపడి 30 గొర్రెలు మృతి చెందాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 26 మండలాల్లో వర్షం కురిసింది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షం కురిసింది. పిడుగుపాటుతో రాష్ట్రంలో శనివారం ముగ్గురు మృతిచెందారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని మావిళ్లపాడు దళితవాడకు చెందిన గ్రామ వలంటీర్ శ్రీలత(31) పిడుగుపాటుతో మృతిచెందగా, ప్రకాశం జిల్లా హెచ్‌ఎంపాడు మండలంలో ఒకరు, గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఒకరు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో 25.8 మిల్లీమీటర్లు, నెల్లూరులో 19.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లా తుగ్గలిలో 15.8, విశాఖ జిల్లా పెదబయలులో 13.8, చిత్తూరు జిల్లా రామకుప్పంలో 12.5, గుంటూరులో జిల్లా వినుకొండలో 11.8, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment