సాక్షి, అమరావతి: సహకరిస్తున్న ప్రకృతితోపాటు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మేడి పట్టి ముందస్తు ఏరువాకకు అన్నదాతలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కేరళపై విస్తరించిన నైరుతి పవనాలు మరో ఐదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కాడెద్దులతో అన్నదాతలు ముందస్తుకు సన్నద్ధమయ్యారు. ఈసారి వాతావరణం బాగా అనుకూలించి ముందస్తుగా రుతు పవనాల రాకతో వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల నుంచి ఎరువుల దాకా సర్వం సిద్ధం చేసి ఇప్పటికే రైతన్నలకు అందుబాటులో ఉంచింది.
ముందస్తు ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతుండగా నేటి నుంచి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వరితోపాటు ఇతర పంటల విత్తనాల పంపిణీ ప్రారంభం కానుంది. తొలిసారిగా ఆర్బీకేల్లో పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీ మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ముందస్తు ఖరీఫ్‌కు అనుగుణంగా ఎరువులను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో జూన్–జూలై నెలల్లో డిమాండ్‌కు సరిపడా నిల్వ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా గోదావరి డెల్టాకు నేడు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
ఎరువులు.. విత్తనాలు
గత ఖరీఫ్‌లో రాష్ట్రంలో 15.34 లక్షల టన్నుల ఎరువులను వినియోగించగా ఈసారి 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. రబీలో మిగిలిన నిల్వలతో పాటు ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏప్రిల్, మేలో కేంద్రం 3.47 లక్షల టన్నులను కేటాయించడంతో 7.69 లక్షల టన్నుల ఎరువులున్నాయి. ఇందులో 1.21 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగడంతో 6.48 లక్షల టన్నులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేశారు. వీటిలో 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ చేశారు. తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. వీటి కోసం ఇప్పటికే 23 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది.
తొలుత తూర్పు, పశ్చిమ డెల్టాలో
గోదావరి తూర్పు డెల్టా కింద 2 లక్షలు, సెంట్రల్ డెల్టా పరిధిలో 1.7 లక్షల ఎకరాలు, వెస్ట్రన్ డెల్టా పరిధిలో 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తొలుత ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో 6.3 లక్షలకు పైగా ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రారంభం కానుంది. సెంట్రల్ డెల్టా పరిధిలో కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలకు నీరందేందుకు కనీసం 15 రోజులు పడుతుంది.
నీటి విడుదలతో ముందుగా రాజమహేంద్రవరం, మండపేట, రాయవరం, రామచంద్రాపురం, కొవ్వూరు, నిడదవోలు, మార్టేరు, పెనుగొండ తదితర ప్రాంతాల్లో నారుమళ్లు పోసుకునేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాలువలకు విడుదలయ్యే నీటిని సద్వినియోగం చేసుకునేలా ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నారు.
► ఖరీఫ్‌లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
► ఈసారి ఖరీఫ్‌లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 40.76 లక్షల ఎకరాల్లో వరి, 18.26 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 15,97 లక్షల ఎకరాల్లో పత్తి, 8.88 లక్షల ఎకరాల్లో అపరాలు 3.94 లక్షల ఎకరాల్లో మిరప, 2.95 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు.
► ఖరీఫ్ కోసం 6,16,664 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. 29,417 క్వింటాళ్ల విత్తనాలను 90 శాతం సబ్సిడీతో ఇవ్వనుండగా 5,87,247 క్వింటాళ్ల విత్తనాన్ని 25 నుంచి 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు.
► ఆర్బీకేల్లో 94,542 క్వింటాళ్ల పచ్చి ట్ట విత్తనాల పిణీ జోరుగా జరుగుతోంది. మరో వైపు 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా
ఇప్పటివరకు 1,73,635 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేశారు. ఇప్పటివరకు 1,25,318 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
► వరి సహా ఇతర పంటలకు సంబంధించి 1,92,433 క్వింటాళ్ల విత్తనాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందులో 1,72,234 క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు ఇతర పంటలకు సంబంధించినవి ఉన్నాయి.
వెంటనే నారుమళ్లు పోస్తాం..
మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. నీటి విడుదలలో ఆలస్యం వల్ల ఏటా కోతకొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. గతేడాది వర్షాలు, తుపాన్ల వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. ఈఏడాది ప్రభుత్వం జూన్ 1నే డెల్టాకు నీరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే నారుమళ్లు పోసి నాట్లు వేసుకుంటా. ఈసారి స్వర్ణతో పాటు ఎంటీయూ 1318, పీఎల్ 1100 రకాలు సాగు చేస్తా.
–సంకురాత్రి సుబ్బారావు, ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా
వ్యవసాయానికి మంచిరోజులు
వ్యవసాయానికి నిజంగా మంచిరోజులొచ్చాయి. ముందుగా సాగునీరు ఇవ్వాలని కోనసీమలో గతంలో రైతులంతా లక్ష ఎకరాల్లో సాగు సమ్మె చేశారు. నాటి డిమాండ్ నేడు సాకారమైంది. ప్రభుత్వం ముందస్తుగా సాగు నీరివ్వడం నిజంగా రైతులకు వరం లాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీటి వృథాను అరికట్టి సాగు చేపట్టాలి.
–కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
రైతులకెంతో మేలు
ముందస్తు ఖరీఫ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కాలువలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని అదును దాటిపోకుండా ఖరీఫ్ సాగు చేపట్టాలి.
–జున్నూరి రామారావు(బాబి) రైతు, ఏపీ వ్యవసాయ కమిషన్ సభ్యుడు
అదునులో సాగుతో అదనపు దిగుబడి
‘నాకు 59 సెంట్ల సొంత భూమి ఉంది. మరో 5 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతేడాది అకాల వర్షాలు, తుపాన్ల వల్ల దిగుబడి తగ్గింది. ఈసారి జూన్ 1వ తేదీనే డెల్టాకు నీరిస్తుండటంతో బుధవారమే నారుమడి పోస్తున్నా. అదునులో సాగు చేపడుతుండటంతో ఎకరాకు కనీసం 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ముందుగా నీళ్లిస్తున్న ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు’
– కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, రాయవరం మండలం, కోనసీమ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment