
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అధిక వర్షాలు నమోదుకావడంతో సాగు కళ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 72.78 లక్షల (70%) ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి సాగైన పంటల విస్తీర్ణం కంటే ఇది దాదాపు రెట్టింపని వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కోటి 25 లక్షల ఎకరాల్లో సాగును ప్రతిపాదించినప్పటికీ, గత ఐదేళ్ల సాగు ఆధారంగా వ్యవసాయ శాఖ సాధారణ సాగు అంచనాలను లెక్కిస్తుంది. దీని ప్రకారం రాష్ట్రంలో ఈ వానా కాలంలో కోటి 3 లక్షల ఎకరాల సాధారణ సాగు అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా పత్తి సాధారణ సాగు అంచనా 44.50 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 113 శాతం సాగు చేశారు. పత్తి పంటనే అధికంగా సాగైంది. ప్రభుత్వం నియం త్రిత సాగులో భాగంగా 60.16 లక్షల ఎకరాల్లో పత్తి పంటను ప్రతిపాదించగా ఇప్పటికే 50.41 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.
ఇక ఇప్పుడిప్పుడే వరి నాట్లు పుంజుకుంటు న్నాయి. వరి 27.25 లక్షల ఎకరాల సాధారణ సాగుకుగాను 6.42 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. అలాగే జొన్న సాధారణ సాగు 1.19 లక్షల ఎకరాలు కాగా 96,198 ఎకరాల్లో, కందు లు 7.61 లక్షల ఎకరాలకుగాను 7.44 లక్షల ఎకరాల్లో, పెసర్లు 2.21 లక్షల ఎకరాలకు గాను 1.04 లక్షల ఎకరాల్లో, మినుములు 68,584 ఎకరాలకుగాను 36,408 ఎకరాల్లో వేశారు. మొత్తం పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 8.86 లక్షల ఎకరాలుగా నమోదైంది. మొక్కజొన్న సాధారణ సాగు అంచనా 11.76 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికే 1.23 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సోయాబీన్ 4.88 లక్షల ఎకరాలకుగాను 3.65 లక్షల ఎకరాల్లో వేశారు. ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వందశాతం సాగు పూర్తయింది. మరో 11 జిల్లాల్లో 76% నుంచి 100% మధ్యలో సాగు నమోదైంది. మూడు జిల్లాల్లో 25 % కంటే తక్కువగా పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది.
ఇప్పటికి అధిక వర్షపాతమే...
రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో 22 జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. 10 జిల్లాల్లో సాధారణ వర్ష పాతం రికార్డయింది. నిర్మల్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలతో ఈ సీజన్లో 720.4 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్ లో 34% అధికంగా వర్షం కురిసింది. ఇక జూలైలో 244.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా బుధవారం నాటికి 145.8 మిలిమీటర్లు్ల కురిసిందని వ్యవసాయశాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment