వరుణుడి కరుణ | Floods in the rivers have just started due to heavy rains in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వరుణుడి కరుణ

Published Mon, Jun 7 2021 3:40 AM | Last Updated on Mon, Jun 7 2021 3:40 AM

Floods in the rivers have just started due to heavy rains in Andhra Pradesh - Sakshi

అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని దేవర చెరువు

రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద 105.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో వరద జలాలను ఒడిసి పట్టిన ప్రభుత్వం.. ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించి రికార్డు సృష్టించింది.

ఈ ఏడాదీ వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి.. రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టింది. గోదావరి డెల్టాకు ఈ నెల 15 నుంచి నీళ్లందించడానికి జల వనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణాలో వరద ప్రవాహం.. గోదావరిలో నీటి మట్టం 14 మీటర్లకు దాటగానే కృష్ణా డెల్టాకు నీళ్లందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం పెరగగానే.. వంశధార, తోటపల్లి, మడ్డువలస తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మిగతా ప్రాజెక్టుల్లోకి చేరే వరద ప్రవాహం, నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీళ్లందించడంపై నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశాల్లో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.  

సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రారంభంలోనే నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్‌)తో పాటు రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటం.. దుర్భిక్ష రాయలసీమలో అప్పుడే బాహుదా, హంద్రీ వంటి నదుల్లో వరద ప్రవాహం ప్రారంభం కావడాన్ని నీటి పారుదల రంగ నిపుణులు మంచి శకునాలుగా అభివర్ణిస్తున్నారు. గతేడాది ఇదే రోజుతో పోల్చితే ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 88.26 టీఎంసీలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా వేసింది. ఆ అంచనాల మేరకు సమృద్ధిగా వర్షాలు కురిస్తే గతేడాది కంటే ముందుగానే ఈ ఏడాది ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంటుంది. గత రెండేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్‌లో గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు 16.21 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 29.90 మి.మీల వర్షం కురింది. నెల్లూరు మినహా మిగతా 12 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దుర్భిక్ష రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ సాధారణం కంటే సగటున 170 శాతం అధిక వర్షపాతం కురవడం గమనార్హం. నైరుతి రుతు పవనాల ప్రారంభ దశలోనే రాష్ట్రంతోపాటు.. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టులు నిండాలంటే 557.53 టీఎంసీలు అవసరం
► రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అప్పుడే నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉరకలెత్తడంతో ఎన్టీఆర్‌ జలాశయం నిండింది. దాంతో గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పెన్నాలో వరద ప్రవాహం ప్రారంభమైంది. సోమశిల ప్రాజెక్టులోకి 6,600 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కర్నూలు జిల్లాలో హంద్రీ నది ద్వారా గాజులదిన్నె, శ్రీశైలం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద ప్రవాహం చేరుతోంది. నాగావళి, వంశధారలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది.
► కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, వెలిగోడు, గాజులదిన్నె, అవుకు తదితర ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 601.13 టీఎంసీలు. ప్రస్తుతం 230.78 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే 370.35 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా నీటి నిల్వలు ఉన్నాయి. బేసిన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిస్తే గతేడాది కంటే ఈ ఏడాది ముందుగానే కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం చేరే అవకాశం ఉంటుంది. గతేడాది తరహాలోనే వరద ఉధృతి కొనసాగితే బేసిన్‌లో ప్రాజెక్టులన్నీ త్వరగా నిండే అవకాశం ఉంటుంది.
► పెన్నా బేసిన్‌లో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీరు నిల్వ ఉంది. బేసిన్‌లో మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 261.58 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 146.57 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే 115.01 టీఎంసీలు అవసరం. పెన్నాలో ఆదిలోనే వరద ప్రవాహం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ప్రాజెక్టులన్నీ నిండే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా.
► గోదావరిలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. రాష్ట్రంలో గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టుల నీటి నిల్వ 12.56 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.09 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
► వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఈ బేసిన్‌లలో ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటి నిల్వ 107.08 టీఎంసీలు.. ప్రస్తుతం 42.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు నిండాలంటే 64.69 టీఎంసీలు అవసరం.


వరుసగా మూడోసారి సకాలంలో నైరుతి రుతు పవనాలు  
మూడేళ్లుగా వాతావరణం అనుకూలంగా మారడంతో నైరుతి రుతుపవనాలు సకాలంలో విస్తరిస్తున్నాయి. రుతుపవనాలు ఇలా రావడం గత 23 ఏళ్లలో ఇదే ప్రథమం. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ పరిస్థితి.. లానినో ప్రభావంతో సముద్రంలో వేడి తగ్గడం రుతు పవనాల గమనానికి అనుకూలంగా మారింది. 2019 నుంచి లానినో ఉంది. ప్రస్తుతం లానినో వల్ల వాతావరణం చల్లబడి వర్షాలు బాగా కురుస్తున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. మన రాష్ట్రంలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఏటా 566 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సివుంది. లానినో వల్ల గత ఏడాది సాధారణం కంటే ఎక్కువగా 720 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  

రుతు పవనాలంటే..
భూమధ్య రేఖ నుంచి ప్రయాణించే గాలులు ఎత్తుగా ఉన్న హిమాలయాలు అడ్డు రావడంతో అక్కడ ఆగిపోతాయి. వాటినే నైరుతి రుతు పవనాలుగా పిలుస్తారు. ఆ గాలుల్లో తడి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. అక్కడ ఆగిపోయిన ఆ గాలులు మళ్లీ భూమధ్య రేఖ వైపు వెనక్కి వస్తాయి. వీటిని ఈశాన్య రుతు పవనాలుగా పిలుస్తారు. ఈ గాలుల్లో తడి శాతం తక్కువగా ఉండడం వల్ల పెద్దగా వర్షాలు పడవు.

ఎలినినో, లానినో అంటే..
పసిఫిక్‌ మహాసముద్రంలో సాధారణం గాలులు భూమధ్య రేఖ వెంబడి పడమటి వైపు వీస్తూ దక్షిణ అమెరికా నుండి ఆసియా వైపు వేడి నీటిని పీల్చుకుంటాయి. ఆ నీటిని భర్తీ చేయడానికి, చల్లటి నీరు సముద్రం లోతుల నుండి పైకి వస్తుంది. అక్కడ వీచే గాలులను అడ్డుకునే వాతావరణ పరిస్థితులను ఎలినినో, లానినో అంటారు. వీటి ప్రభావం అన్ని సముద్రాలపైనా పడి వాతావరణ, పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఎలినినో మన దేశంలో సాధారణ వాతావరణ పరిస్థితులను అడ్డుకుంటుంది. ఇది ఉంటే వర్షాలు పడవు. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. లానినో ద్వారా అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. సాధారణంగా ఇవి 9 నుండి 12 నెలల వరకు, కొన్నిసార్లు సంవత్సరాలపాటు ఉంటాయి.

రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు అంతటా విస్తరించాయి. రాయలసీమ.. తెలంగాణ, మహారాష్ట్రల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి. సోమవారం సాయంత్రం నాటికి దక్షిణాంధ్ర జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయని, రాగల రెండు రోజుల పాటు కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నంబులపూలకుంటలో 11 సెం.మీ, చినమండెంలో 9, ఊటుకూరులో 8, సంబెపల్లె, అనంతపురంలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement