సోమవారం సాయంత్రం బెజవాడను కమ్మేసిన మేఘాలు
సాక్షి, అమరావతి: ఎండ వేడిమితో ఉడికిపోతున్న రాష్ట్రాన్ని నైరుతి రుతు పవనం చల్లగా పలకరించింది. సోమవారం రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఇవి విస్తరించాయి.
రుతు పవన గాలులు బలంగా ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు, ఆ తర్వాత రెండు రోజుల్లో కోస్తా ప్రాంతాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. చల్లని గాలులు వీస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. రాబోయే ఐదు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
ఈ వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 566 మిల్లీ మీటర్లు. ఈసారి దీనికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈసారి అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఈ నెలలో రెండు, మూడు వారాల నుంచి వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
నైరుతి సీజన్‌లో సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడతాయి. జులై, ఆగస్టు నెలల్లో మధ్య కోస్తా జిల్లాలు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
వారం రోజులు ఆలస్యం
నైరుతి రుతు పవనాలు ఈసారి వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి వచ్చాయి. అసని తుఫాను ప్రభావంతో కొంచెం ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. గత నెల 28న (సాధారణంగా జూన్ 1న తాకాలి) కేరళను తాకాయి.
అదే వేగంతో ముందుకు కదిలి ఈ నెల 3, 4 తేదీల్లో (సాధారణంగా జూన్ 5న) ఏపీలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ రాజస్థాన్ వైపు నుంచి పశ్చిమ గాలుల ప్రభావం తీవ్రమవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుతు పవనాలు కర్ణాటక నుంచి ఏపీ వైపు కదలకుండా ఉండిపోయాయి. ఎట్టకేలకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
Comments
Please login to add a commentAdd a comment