ఉరిమే ఉత్సాహం! | Cultivation is much larger than the last Kharif cultivation in AP | Sakshi
Sakshi News home page

ఉరిమే ఉత్సాహం!

Published Mon, Jun 1 2020 3:30 AM | Last Updated on Mon, Jun 1 2020 8:58 AM

Cultivation is much larger than the last Kharif cultivation in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగుకు అన్నీ శుభ సూచికలు కనిపిస్తుండటంతో రైతన్నలు ఆనందోత్సాహాలతో ఏరువాక సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ), వాతావరణ నిపుణులు ప్రకటించారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఈ ఏడాది తొలి విడత కింద ప్రభుత్వం ఇప్పటికే రూ.7,500 చొప్పున జమ చేయడంతో ఖరీఫ్‌లో అత్యధిక విస్తీర్ణంలో పంటల సాగుకు అన్నదాతలు ఆనందోత్సాహాలతో కదులుతున్నారు. మరోవైపు కల్తీలు, నకిలీలకు ఆస్కారం లేకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నకిలీ విత్తనాలు/కల్తీల వల్ల నష్టపోయిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీన్ని నివారించి రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఎంత కావాలన్నా 48 గంటల్లోగా నాణ్యమైనవి సర్టిఫై చేసి సమకూరుస్తోంది. తమ ఊరిలోనే గడప వద్దే విత్తనాలు, ఎరువులు అందుతుండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తాయి. వ్యయ ప్రయాసలు ఉండవు. మరోవైపు ప్రభుత్వం విత్తన చట్టాన్ని పటిష్టం చేసింది. ఎక్కడైనా నకిలీ విత్తనాల వల్ల రైతు నష్టపోతే పరిహారం అందేలా విత్తన చట్టాన్ని పకడ్బందీగా రూపొందించింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకుంటే ప్రభుత్వమే ఆర్బీకేలా ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇవన్నీ తమకు మేలు చర్యలు కావడంతో అన్నదాతలు ఏరువాక పౌర్ణమిని ఆనందంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించడం, రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాత విధానాలను అనుసరిస్తుండటంతో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే బాగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 

నేడు కేరళకు ‘నైరుతి’ ఆగమనం..
నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకడం ద్వారా భారత్‌ భూభాగంపై ప్రవేశిస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈనెల 5వ తేదీ ఏరువాక పౌర్ణమి కాగా దాదాపు సకాలంలో అంటే జూన్‌ 10వతేదీలోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. గతేడాది జూన్‌ 16న నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. అనుకూల వాతావరణ పరిస్థితులున్నందున నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. ‘వచ్చే 12 గంటల్లో  దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమెరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి.

సోమవారం సాయంత్రానికి గానీ రాత్రికిగానీ కేరళను తాకే అవకాశం ఉంది’ అని ఐఎండీ ఆదివారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ‘పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నైరుతి రుతుపవనాలు సోమ లేదా మంగళవారం కేరళలో ప్రవేశిస్తాయి. తదుపరి ఇవి జూన్‌ రెండోవారం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. తదుపరి కోస్తాంధ్ర, తెలంగాణకు విస్తరిస్తాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్ధారించిన తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో ఒకరోజు అటు ఇటుగా చెప్పవచ్చు’ అని ఐఎండీ హైదరాబాద్‌ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. 

మంచి సంకేతమే..
‘ఈ ఏడాది మంచి వర్షాలే కురుస్తాయి. జూన్‌ పదో తేదీకల్లా రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపనవాలు రాకముందు ఈ సీజన్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురవడం రివాజే. ఇలా జరగడం మంచి సంకేతమే’ అని ఐఎండీ రిటైర్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేజీ రమేష్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

అరేబియాలో అల్పపీడనం
– నేడు, రేపు కోస్తా, సీమలో తేలికపాటి జల్లులు
ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఇదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తుపానుగా మారిన తర్వాత  ఉత్తర దిశగా ప్రయాణించి ఈ నెల 3వ తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్‌ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో జూన్‌ 1, 2 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరోవైపు మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం 1 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెంమీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement