
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి శుక్రవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 22వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. ఇది క్రమంగా బలపడి వాయవ్యదిశగా కదులుతూ తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తుపానుగా మారితే దీనికి యాస్ పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇది మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రుతుపవనాల రాకకు సంకేతంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపాన్లు ఏర్పడుతుంటాయని చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని, కేవలం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment