భారీ వర్షం ధాటికి ముంబైలో సరస్సును తలపిస్తున్న రోడ్డుపై చిన్నపడవలో వెళ్తున్న స్థానికులు
ముంబై/న్యూఢిల్లీ: వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి జలసంద్రమైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు జలమయం కాగా, రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య సుమారు 157 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీకి చెందిన కొలాబా అబ్జర్వేటరి పేర్కొంది. 2005లో కురిసిన వర్షాల కన్నా ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని నగర పాలక సంస్థ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సూచనలు జారీచేసింది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో సీనియర్ అధికారుల వారాంతపు సెలవులను రద్దుచేసింది. వరదల తీవ్రత ఎక్కువైతే బాధితులకు ఆవాసం కల్పించేందుకు పాఠశాలలను అన్ని వేళలా తెరచిఉంచాలని నిర్ణయించింది. తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాల్లో సేవలందించేందుకు నేవీ సిబ్బంది సిద్ధంగా ఉంచారు. పరేల్, అంధేరిల్లో మూడు జాతీయ విపత్తు ఉపశమన బృందాలను మోహరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వర్షాల దెబ్బకు ముంబైలో లోకల్, ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 32 విమానాలు ఆలస్యం కాగా, మూడింటి సేవలను రద్దుచేశారు.జారుడుబల్లలా మారిన దారుల వెంట నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
థానేలో ఇద్దరు మృతి..
పిడుగుపాటు వల్ల థానేలో 66 ఏళ్ల మత్స్యకారుడు మరణించినట్లు జిల్లా విపత్తు విభాగం చీఫ్ శివాజి పాటిల్ తెలిపారు. అదే ప్రాంతంలో ఉన్న మరో ఆరుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో బైకు ట్రక్కును ఢీకొనడంతో బైకు వెనక కూర్చున్న మహిళ మృతిచెందింది. పంజాబ్, హరియాణా, యూపీల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, యూపీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, అస్సాం, బిహార్, మధ్యప్రదేశ్‌లలో ఆదివారం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనావేసింది.
ఉత్తరప్రదేశ్‌లో 26 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌పై మళ్లీ ప్రకృతి కన్నెర్ర చేసింది. ధూళి తుపాను, పిడుగుపాటుల వల్ల రాష్ట్రంలో 26 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 11 జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి వీటి బీభత్సం కొనసాగినట్లు రాష్ట్ర విపత్తు అధికారులు వెల్లడించారు. జాన్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో ఐదుగురు చొప్పున, ఉన్నావ్‌లో నలుగురు, చందౌలి, బహరైచ్‌లలో ముగ్గురు చొప్పున, సీతాపూర్, అమేథీ, ప్రతాప్‌గఢ్‌లలో ఒక్కరు చొప్పున మరణించినట్లు తెలిపారు. కనౌజ్‌లోనూ ధూళి తుపాను ప్రభావం ఉన్నా ప్రాణనష్టం జరగలేదు. ఉపశమన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అలసత్వం ప్రదర్శించొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కూడా ధూళి తుపానుతో పాటు గంటకు 70 కి.మీ వేగంతో కూడిన బలమైన గాలులు వీచాయి.
జలమయమైన పట్టాలపై వెళ్తున్న రైలు
Comments
Please login to add a commentAdd a comment