Interruption
-
ఆగిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు స్తంభించాయి. మెటా నెట్వర్క్ పరిధిలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం కలిగింది. దీంతో యూజర్లు అల్లలాడిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పాలంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మెటా పరిధిలోని వాట్సాప్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. సాంకేతికలోపం వల్లే మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సర్వీసులు నిలిచిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు, 47000 కంటే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మెటా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సమస్యలను నివేదించడానికి వందలాది యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) ఉపయోగిస్తున్నారు. ఇందులో మెటా డౌన్ అయిందా, లేదా నేను హ్యాక్ చేయబడుతున్నానా?, నా ఇన్స్టాగ్రామ్ లోడ్ కావడం లేదు, ఫేస్బుక్ & ఇన్స్టాగ్రామ్ ఒక సెకను హ్యాక్ అయిందని అనుకున్నన్నానాని.. కామెంట్స్ చేస్తున్నారు. -
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ తొలిసారి ఈ నెల 18న కనిపించింది. భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది. వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24–26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఆ మచ్చ అమాంతంగా 25 శాతం పెరిగింది. తొమ్మిది భూగోళాలకంటే పెద్ద మచ్చ అది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఏర్పడిన అతిపెద్ద మచ్చ ఇదే. దీనికి ఏఆర్3590 అని పేరుపెట్టారు. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. క్రియాశీల ప్రాంతం అని అర్ధం. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. అయితే భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా ఈ సౌరమచ్చపై ఖగోళ శాస్త్రవేత్తలు ఓ కన్నేశారు. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతమైంది. సూర్యుడు అంతర్గతంగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సౌరమచ్చలు ఏర్పడతాయి. అక్కడి పరిసరాలతో పోలిస్తే ఈ మచ్చ ఉష్ణోగ్రత తక్కువ. మచ్చలో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచి్చపెడుతుందేమోనని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరగడం, తీవ్ర సౌర తుపాన్లు చూస్తుంటే సూర్యుడు తన 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే అంటే 2024 జూలైలోపే ‘చండ మార్తాండ’(సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్టం) దశ దాపురిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచి్చపెడుతుందోనని కలవరపడుతున్నారు. ఈ ఉగ్రరూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. సోలార్ మాగ్జిమమ్ దశ ముగిసిందనేది అది పూర్తయిన ఆరు నెలలకుగాని ఖగోళవేత్తలు గుర్తించలేరు. ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోలోపల ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. వీటినే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్) అంటాం. ఇవి సూర్యుడి ఉపరితలంపై అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో 5 రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. సౌరమచ్చ ఏఆర్3590 ఈ నెల 21న రెండు గీ రకం సౌరజ్వాలలను వెదజల్లింది. 22న X 6.3 తీవ్రతతో సౌరజ్వాలను వదిలింది. ఈ మచ్చలోని అస్థిర బీటా–గామా–డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మారి్పడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ట స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మారి్పడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్ల గా సౌర కనిష్ట/సోలార్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ‘కరోనా’ అనేది సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండిన సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ–పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా కృత్రిమ శాటిలైట్లను స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి మాడిపోయి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బయటకు రారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎల్రక్టాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి వచ్చే సౌరధారి్మకత అదే వేగంతో భూమిని తాకుతుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15–18 గంటల్లో భూమిని చేరుతుంది. అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెపె్టంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరగడం ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్‌లోని ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ వీరిలో ఒకరు. 1859 సెపె్టంబర్ ఒకటిన సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ 17.6 గంటల్లో భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపాను ధాటికి టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై టెక్నీíÙయన్లు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కొన్నిచోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్చతో పోలిస్తే నేటి సౌరమచ్చ పరిమాణం 60 శాతంగా ఉంది. సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. – జమ్ముల శ్రీకాంత్ -
నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్ విఫలమైందని నైజీరియా విద్యుత్ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు. -
Hyderabad: 36 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్: గోదావరి తాగునీటి సరఫరా పథకం దశ –1లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న మెయిన్ పైపులైనుకు ఏర్పడ్డ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ నెల19.(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు జరుగనున్నాయి. దీంతో నగరంలోని పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగానీటి సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. పాక్షికంగా అంతరాయం... ► ఓ అండ్ ఎం డివిజన్–6 (ఎస్.ఆర్.నగర్): బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ. ► ఓ అండ్ ఎం డివిజన్–9 (కూకట్పల్లి): కేపీహెచ్‌బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–15 (శేరిలింగంపల్లి): లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్‌నగర్, మయూరి నగర్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్– 23 (నిజాంపేట్): ప్రగతినగర్‌లో కొన్ని ప్రాంతాలు, నిజాంపేట్/బాచుపల్లి. పూర్తిగా అంతరాయం... ► ఓఅండ్ఎం డివిజన్–9 (కూకట్పల్లి): ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–12 (కుత్బుల్లాపూర్): షాపూర్‌నగర్, చింతల్, జీడిమెట్ల/వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్ –13 (మల్కాజిగిరి/అల్వాల్): సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–14 (ఉప్పల్): కాప్రా మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు. సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–19 (నాగారం/దమ్మాయిగూడ): నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ఆర్జీకే ప్రాంతాలు. ఓఅండ్ఎం డివిజన్– 24 (బొల్లారం): రింగ్ మెయిన్–3 ఆన్లైన్ సరఫరా ► ఓఅండ్ఎం డివిజన్– 25 (కొంపల్లి): కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్‌నగర్, దేవరయాంజల్, హకీంపేట్ ► ఆర్డబ్ల్యూఎస్ అప్టేక్ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి) ఘన్పూర్ (మేడ్చల్/ శామీర్‌పేట్), కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు. -
డిజిటల్ ప్రపంచానికి కష్టకాలం తప్పదా?
పొద్దున లేనిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా.. మధ్యలో మనం చేసే దాదాపు ప్రతీ పనికి-స్మార్ట్ ఫోన్‌తో ముడిపడిపోయింది. ఎందుకంటే.. మనమంతా డిజిటల్ వరల్డ్‌లో దర్జాగా బతుకుతున్నాం. ఇంటర్నెట్ లేకుంటే ఏ పనులూ జరగవు!. అలాంటిది ఇంటర్నెట్లేని రేపటిని ఊహించుకోగలమా?.. అమ్మో కలలో కూడా కష్టం అంటారా?.. అయితే ఇది చదివేయండి! ఇంటర్నెట్ అపోకలిప్స్ internet apocalypse.. ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతూ ప్రజల్ని భయపెడుతున్న పదం. దీనర్థం ఇంటర్నెట్కి గడ్డుకాలం వచ్చిందని అప్రమత్తం చేయడమే!. 2025 నాటికల్లా సోలార్ మాగ్జిమమ్(ఉగ్రరూపానికి అన్నట్లు)కి సూర్యుడు చేరుకుంటాడని.. అప్పుడు ఏర్పడే సౌర తుపాన్ల ధాటికి ఇంటర్నెట్కు విఘాతం కలగవచ్చని తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ సౌర తుపాను గనుక భూమిని తాకితే!.. ఈ చర్చ ఇప్పటిది కాదు.. గత కొంతకాలంగా నడుస్తూ వస్తోంది. సౌర తుపాను భూమిని గనుక తాకితే గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోతుంది. అంటే ఇంటర్నెట్ సహా అన్నీ సంధాన వ్యవస్థలు ఆగిపోవచ్చన్నమాట. ఆశ్చర్యకరంగా.. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరిస్తున్నారు. Internet Apocalypse 2025 ఎందుకీ అంతరాయం సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. సమాచార వ్యవస్థకు సంబంధించిన ప్రతీదానిని దెబ్బ తీస్తుంది. 2025 ఇంటర్నెట్ Internet Apocalypse 2025 సంక్షోభాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధృవీకరించలేదు. కానీ, చర్చ జోరుగా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా మీమ్స్ కనిపిస్తున్నాయి. మరి ఆధారం ఏమిటి?.. ఎందుకంటే స్పేస్‌సైన్స్ ఆ వాదనతో ఏకీభవిస్తోంది కాబట్టి. సోలార్ మాగ్జిమమ్ ప్రభావం ఇంటర్నెట్పై కచ్చితంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితులకు ముందుగా సన్నద్ధం కావాలంటూ ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1859లో టెలిగ్రాఫ్స్ సేవలు దెబ్బ తిన్నాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉండొచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంగీత అబు జ్యోతి చెబుతున్నారు. నష్టం ఊహించని దానికంటే.. Internet Apocalypse 2025 సంభవిస్తే గనుక సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు ఉంటుంది?.. తిరిగి ఎన్నిరోజుల్లో యధాస్థితికి తీసుకురావొచ్చనేది ఇప్పుడే చెప్పలేం. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం ఎలా ఎదుర్కొంటుందో కూడా ఊహించలేం. కానీ, జరిగే నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందనేది మాత్రం చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా సౌరతుపాను Internet Apocalypse 2025 గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుంది. -
ఐఆర్‌ఆర్‌ఏ ఏర్పాటుకు అక్టోబర్ డెడ్‌లైన్
న్యూఢిల్లీ: ట్రేడింగ్ మెంబర్ల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడితే ఇన్వెస్టర్లకు సహాయ సహకారాలు అందించేందుకు తగు వేదికను ఏర్పాటు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఇందులో భాగంగా విస్తృత చర్చలు జరిపిన అనంతరం 2023 అక్టోబర్ 1లోగా ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేవాలని స్టాక్ ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లకు శుక్రవారం జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించింది. ట్రేడింగ్ మెంబర్స్ సిస్టమ్స్‌లో తరచూ సాంకేతిక లోపాలు వస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఓపెన్ పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు వాటిని క్లోజ్ చేయలేక నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసేందుకు, పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను రద్దు చేసేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ఉపయోగపడనుంది. సర్క్యులర్ ప్రకారం ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసుల వ్యవస్థను ఎక్సే్చంజీలు రూపొందిస్తాయి. సాంకేతిక లోపాలకు గురైన ట్రేడింగ్ మెంబరు (టీఎం) .. ఈ సర్వీసులను అందించాల్సిందిగా ఎక్సేంజీలను అభ్యర్ధించాల్సి ఉంటుంది. ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసును ఆథరైజ్ చేసిన తర్వాత సదరు టీఎం ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను పరిష్కరించుకోవచ్చు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాక తిరిగి టీఎం సిస్టమ్ ద్వారా ట్రేడింగ్ యథాప్రకారం కొనసాగుతుంది. అంతకు ముందు ఐఆర్‌ఆర్‌ఏ ద్వారా జరిగిన లావాదేవీల వివరాలన్నీ టీఎం సిస్టమ్‌లో ప్రతిఫలిస్తాయి. -
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వాన గండం!
మెల్బోర్న్: టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరిగే ఈ పోరులో ఎప్పుడో టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, 90 వేల సామర్థ్యం గల మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దద్దరిల్లడం ఖాయమని అనిపించింది. అయితే ఇప్పుడు ఈ చిరకాల పోరుకు వాన అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 80 నుంచి 90 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గరిష్టంగా 5 మిల్లీ మీటర్ల వరకు కూడా వాన కురవవచ్చని చెబుతున్నారు. శుక్రవారం కూడా మెల్బోర్న్లో వాన పడింది. -
SBI: మూడు గంటలపాటు డిజిటల్ సేవలకు అంతరాయం
తన ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్ సర్వీసులకు విఘాతం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్ సర్వీసులు పని చేయవని తెలిపింది ఎస్బీఐ. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని తెలిపింది. మెరుగైన సేవలు అందించడం కోసం చేసే మెయింటెనెన్స్ కారణంగానే అంతరాయం కలగనుందని, యూజర్లు ఇది గమనించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ ద్వారా విషయం వెల్లడించిన స్టేట్‌బ్యాంక్.. ఈ ఉదయం మరోసారి కస్టమర్లను అప్రమత్తం చేసింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/GXu3UCTSCu — State Bank of India (@TheOfficialSBI) September 3, 2021 గత కొంతకాలంగా ఎస్బీఐ సర్వీసులపై ఖాతాదారుల్లో, డిజిటల్‌సేవలపై యూజర్లలో అసహనం నెలకొంటోంది. యోనో యాప్ సరిగా పని చేయకపోవడంతో ఫిర్యాదులతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఖాతాదారులకు క్షమాపణలు చెబుతూనే.. యూజర్లకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రయత్నిస్తున్నామని, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫీడ్‌బ్యాక్ రూపంలో వివరంగా ఇవ్వొచ్చని చెబుతోంది ఎస్బీఐ. చదవండి: రిటైల్ సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత -
నేను భారత ఆటగాడినే.. లార్డ్స్‌లో అజ్ఞాత వ్యక్తి హల్చల్
లండన్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మూడో రోజు లంచ్ విరామం ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో అనే ఒక అభిమాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. ‘బైజూస్’ లోగో సహా సరిగ్గా భారత జట్టును పోలిన జెర్సీని అతను ధరించడంతో ముందుగా ఎవరూ గుర్తించలేకపోయారు. pic.twitter.com/I4acms58Ie — Ravi_cricfreak (@ravi_cricfreak) August 14, 2021 అయితే ఆ తర్వాత తేరుకున్న భద్రతా సిబ్బంది అతడి వద్దకు వెళ్లి బయటకు పంపే ప్రయత్నం చేస్తుండగా... తన జెర్సీని చూపిస్తూ నేనూ భారత ఆటగాడినే అన్నట్లుగా సైగ చేస్తూ దాదాపుగా సిబ్బందిని ఒప్పించినంతగా ప్రయత్నించాడు. చివరకు అతడిని మైదానం బయటకు లాక్కుపోతుండగా భారత బృందంలో నవ్వులు విరిశాయి. తొలి సెషన్లో భారత బౌలింగ్ విఫలమవడం చూసి సోషల్ మీడియాలో కొందరు కోహ్లి... ‘జార్వోతో రెండు ఓవర్లు బౌలింగ్ చేయించాల్సింది’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు విసరడం విశేషం. -
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం): గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో నాలుగు రోజుల్లో సుమారు 3.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు రూ.42 కోట్ల విలువైన ఉత్పత్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కరోనాతో పాటు భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడగా, ఈసారి కూడా వర్ష ప్రభావంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా, తమ క్వారీలో ఇప్పటికి 8 కోట్ల గ్యాలన్ల నీరు చేరగా, రెండు 350 హెచ్‌పీ, ఐదు 240 హెచ్‌పీ మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నట్లు కొత్తగూడెంలోని గౌతంఖని ఓపెన్ కాస్ట్ (జీకేఓసీ) పీఓ వెంకట్రాంరెడ్డి తెలిపారు. మొత్తం నీరు తొలగిస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని ఆయన వివరించారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 25 భూగర్భ గనులు, 20 ఓపెన్‌కాస్ట్ గనులు ఉన్నాయి. ఇందులో 20వ తేదీన 1.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా నికి గాను 70 వేల టన్నుల ఉత్పత్తి జరగలేదు. -
తప్పతాగి దర్జాగా నిద్రపోయాడు; రైల్వే సేవలకు అంతరాయం
ఢిల్లీ: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్(ఏఎస్ఎమ్) నిర్వాకంతో నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఢిల్లీ- హౌరా మధ్య కొన్ని గంటలపాటు సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సదరు వ్యక్తి స్పందించలేదు. దీంతో ఏమైందోనని ఉరుకులు పరుగుల మీద వచ్చిన అధికారులు అక్కడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. అప్పటికే ఫూటుగా మద్యం తాగి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక తప్ప తాగినందుకు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన అనిరుద్ కుమార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా గురువారం విధులకు హజరైన అతను డ్యూటీలోనే మద్యం సేవించాడు. కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే స్టేషన్‌కు ఫరక్కా, మగధ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి వెనుకాల చాలా గూడ్స్ రైళ్లు కూడా ఆగి ఉన్నాయి. ఎంతసేపటికి రైళ్లు కదలకపోవడంతో నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు అనిరుద్ కుమార్‌కు ఫోన్ చేశారు. ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో అధికారులు వచ్చి చూడగా.. అధికారులు షాక్ తిన్నారు. అనిరుద్ కుమార్ దర్జాగా నిద్రపోతున్నాడు. అతన్ని లేపే ప్రయత్నం చేయగా.. మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి తుండ్లాలోని మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఇలాంటి అధికారులు ఉండడంతోనే దేశం ఇలా తగలడింది..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ముంబైలో పవర్ కట్
ముంబై: ముంబై సోమవారం విద్యుత్ అంతరాయంతో స్తంభించింది. ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో లక్షలాది మంది ఇళ్లలో ఉండి అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్, ఇతర అత్యవసర రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల కోసం డీజిల్ జనరేటర్లను యంత్రాంగం తరలించాల్సి వచ్చింది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటలకు సేవలను క్రమక్రమంగా పునరుద్ధరించగలిగింది. కాగా, ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యుత్, తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్ అంతరాయం ఘటనపై తక్షణం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ(ఎంఎస్ఈటీసీఎల్)కు చెందిన కల్వా– ఖర్ఘార్ సబ్స్టేషన్లలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో అంతరాయం ఏర్పడిందని విద్యుత్ మంత్రి నితిన్ తెలిపారు. లోడ్ భారమంతా మోస్తున్న రెండో సర్క్యూట్లో లోపం తలెత్తడమే ఇందుకు కారణమన్నారు. కల్వా సబ్‌స్టేషన్ వరకు విద్యుత్‌ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర విద్యుత్ సంస్థది కాగా, అక్కడి నుంచి టాటా, అదానీ సంస్థలు నగరానికి సరఫరా చేస్తుంటాయన్నారు. ముంబైతోపాటు సబర్బన్‌లోని థానే, పన్వెల్, డోంబివిలి, కల్యాణ్‌లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. కంపెనీలు, సంస్థల్లో మాదిరిగా బ్యాక్–అప్ సౌకర్యం లేని ఇళ్లలోని లక్షలాది మంది ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’ సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో కోవిడ్ వైద్య కేంద్రాల్లోని వారి కోసం డీజిల్ జనరేటర్లను, సినిమా షూటింగ్‌ల కోసం వాడే మొబైల్ డీజిల్ జనరేటర్లను తెప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేయించేందుకు ఏర్పాటు చేసిన రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి పనిచేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఓ అధికారి వివరించారు. -
జీమెయిల్ సర్వీసులకు అంతరాయం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి చాలాసేపు జీమెయిల్ సహా గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ మొదలైన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. లాగిన్ కాలేకపోవడం, అటాచ్మెంట్స్ చేయలేకపోవడం, మెసేజ్‌లు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జీమెయిల్ హ్యాష్‌ట్యాగ్ చాలాసేపు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిల్చింది. మరోవైపు, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఉదయం వెల్లడించిన గూగుల్ ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు సాయంత్రానికి ప్రకటించింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఓర్పు వహించినందుకు, మద్దతుగా నిల్చినందుకు ధన్యవాదాలు. వ్యవస్థ విశ్వసనీయతకు గూగుల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఎప్పటికప్పుడు మా వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నాం‘ అని పేర్కొంది. సర్వీసులకు అంతరాయం కలగడంపై దర్యాప్తు చేస్తున్నట్లు తమ సేవల వివరాలను తెలియజేసే ’జీ సూట్’ స్టేటస్ డ్యాష్‌బోర్డు ద్వా రా ఉదయమే గూగుల్ వెల్లడించింది. కొందరు యూజర్లకు సర్వీసులను పునరుద్ధరించినట్లు, మిగతా యూజర్ల సమస్యలనూ సత్వరం పరిష్కరించనున్నట్లు పేర్కొంది. గూగుల్ వివరణ ప్రకారం.. ఈ–మెయిల్స్, మీట్ రికార్డింగ్, డ్రైవ్‌లో ఫైల్స్ క్రియేట్ చేయడం, గూగుల్ చాట్‌లో మెసేజ్‌లు పోస్ట్ చేయడం వంటి అంశా ల్లో సమస్యలు తలెత్తాయి. అయితే, సేవల అంతరాయానికి కారణమేంటన్నది తెలియరాలేదు. కంపెనీ నిర్దిష్టంగా వివరాలు వెల్లడించనప్పటికీ డౌన్‌డిటెక్టర్ (వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంల సేవల్లో అంతరాయాల వివరాలను తెలిపే సంస్థ) డేటా ప్రకారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా యూజర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. -
చిన్న గ్యాప్ తర్వాత...
ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా స్క్రీనింగ్ కోసం గతవారం లండన్‌లో గడిపారు దర్శకులు రాజమౌళి. ఈ కార్యక్రమం వల్ల ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణకు చిన్న అంతరాయం ఏర్పడింది. లండన్ నుంచి రాజమౌళి తిరిగి రావడంతో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. 1920 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలగడంతో జార్ఖండ్‌లోని ఓ ట్రయల్ కోర్టు కేసు విచారణను వాట్సాప్ కాల్ ద్వారా నిర్వహించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసుల విచారణను జోక్ అనుకుంటున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. జార్ఖండ్ మాజీ మంత్రి యోగేంద్ర సావో, ఆయన భార్య నిర్మలా దేవీలపై 2016లో జార్ఖండ్‌లో అల్లర్లు రెచ్చగొట్టినట్లు కేసు నమోదయింది. ఈ కేసులో హజారీబాగ్ ట్రయల్ కోర్టు జడ్జి నిందితుల్ని భోపాల్ కోర్టులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఇంటర్నెట్ సమస్య తో వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలగడంతో వాట్సాప్ కాల్ ద్వారా విచారణ చేపట్టి నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. దీన్ని సవాలు చేస్తూ సావో, నిర్మల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్ బాబ్డే, జస్టిస్ ఎల్ఎన్ రావుల ధర్మాసనం స్పందిస్తూ..‘అసలు జార్ఖండ్‌లో ఏం జరుగుతోంది? ఇలాంటి పద్ధతులను అనుమతించకూడదు. ఇదేం రకమైన విచారణ? అని జార్ఖండ్ ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ముంబై జలసంద్రం
ముంబై/న్యూఢిల్లీ: వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి జలసంద్రమైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు జలమయం కాగా, రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య సుమారు 157 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీకి చెందిన కొలాబా అబ్జర్వేటరి పేర్కొంది. 2005లో కురిసిన వర్షాల కన్నా ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని నగర పాలక సంస్థ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సూచనలు జారీచేసింది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో సీనియర్ అధికారుల వారాంతపు సెలవులను రద్దుచేసింది. వరదల తీవ్రత ఎక్కువైతే బాధితులకు ఆవాసం కల్పించేందుకు పాఠశాలలను అన్ని వేళలా తెరచిఉంచాలని నిర్ణయించింది. తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాల్లో సేవలందించేందుకు నేవీ సిబ్బంది సిద్ధంగా ఉంచారు. పరేల్, అంధేరిల్లో మూడు జాతీయ విపత్తు ఉపశమన బృందాలను మోహరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వర్షాల దెబ్బకు ముంబైలో లోకల్, ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 32 విమానాలు ఆలస్యం కాగా, మూడింటి సేవలను రద్దుచేశారు.జారుడుబల్లలా మారిన దారుల వెంట నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు ప్రజలకు సూచించారు. థానేలో ఇద్దరు మృతి.. పిడుగుపాటు వల్ల థానేలో 66 ఏళ్ల మత్స్యకారుడు మరణించినట్లు జిల్లా విపత్తు విభాగం చీఫ్ శివాజి పాటిల్ తెలిపారు. అదే ప్రాంతంలో ఉన్న మరో ఆరుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో బైకు ట్రక్కును ఢీకొనడంతో బైకు వెనక కూర్చున్న మహిళ మృతిచెందింది. పంజాబ్, హరియాణా, యూపీల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, యూపీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, అస్సాం, బిహార్, మధ్యప్రదేశ్‌లలో ఆదివారం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనావేసింది. ఉత్తరప్రదేశ్‌లో 26 మంది మృతి లక్నో: ఉత్తరప్రదేశ్‌పై మళ్లీ ప్రకృతి కన్నెర్ర చేసింది. ధూళి తుపాను, పిడుగుపాటుల వల్ల రాష్ట్రంలో 26 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 11 జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి వీటి బీభత్సం కొనసాగినట్లు రాష్ట్ర విపత్తు అధికారులు వెల్లడించారు. జాన్పూర్, సుల్తాన్‌పూర్‌లలో ఐదుగురు చొప్పున, ఉన్నావ్‌లో నలుగురు, చందౌలి, బహరైచ్లలో ముగ్గురు చొప్పున, సీతాపూర్, అమేథీ, ప్రతాప్‌గఢ్‌లలో ఒక్కరు చొప్పున మరణించినట్లు తెలిపారు. కనౌజ్‌లోనూ ధూళి తుపాను ప్రభావం ఉన్నా ప్రాణనష్టం జరగలేదు. ఉపశమన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అలసత్వం ప్రదర్శించొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కూడా ధూళి తుపానుతో పాటు గంటకు 70 కి.మీ వేగంతో కూడిన బలమైన గాలులు వీచాయి. జలమయమైన పట్టాలపై వెళ్తున్న రైలు -
ఢిల్లీని ముంచెత్తిన గాలి దుమారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ గాలి దుమారం వణికించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఆ తీవ్రతకు ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, గురుగ్రామ్, నోయిడాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నేడు అన్ని సాయంత్రపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆరుబయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించింది. మరోవైపు ఉత్తర భారతదేశంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. రాజస్తాన్‌లో ఇసుక తుపానులు, ఆరు రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం గంటకు 50–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. -
స్థల వివాదంతో అంత్యక్రియలకు ఆటంకం
సిరికొండ(బోథ్) : మండల కేంద్రంలోని బోయివాడ కాలనీ సమీపంలో మంగళవారం శ్మశాన వాటికలో కొద్దిసేపు హైడ్రామా సాగింది. వివరాలు.. బోయివాడ కాలనీ సమీపంలో ఉన్న శ్మశాన వాటిక స్థలం కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. శ్మశాన వాటిక స్థలం తనదంటున్న ఓ వ్యక్తికి కాలనీవాసులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారం కాకుండానే సదరు వ్యక్తి ఆ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. స్థలాన్ని తిరిగి గ్రామస్తులకు అప్పగించాలని కాలనీవాసులు స్థానిక తహసీల్దార్, కలెక్టర్‌కు పలుసార్లు ఫిర్యాదులు చేశారు. ఈమేరకు అధికారులు ఆ స్థలాన్ని సర్వే చేసి ఎవరికి అప్పగించకుండా ఉంచారు. మంగళవారం బోయివాడ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ సభ్యులు వివాద స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన కంచె నిర్మించిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాల మధ్య గంటకుపైగా వివాదం చెలరేగింది. పోలీసులు, తహసీల్దార్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. దీంతో పరిస్థితి సద్దుమనిగింది. ఆ స్థలం ఎవరిదో మరోసారి విచారణ చేసి పరిష్కరిస్తామని ఎస్సై రామగౌడ్, డెప్యూటీ తహసీల్దార్ త్రియంబక్‌రావు హామీ ఇచ్చారు. దీంతో ఆ సదరు వ్యక్తి ఒప్పుకోవడంతో మృతుడి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. -
భ ‘రూసా’ అందేదెన్నడో ?
రూసా పథకం కింద రూ.10 కోట్లు మంజూరు ఏడాదిగా ఎస్పీడీ దగ్గరే మూలుగుతున్న నిధులు పలు అభివృద్ధి పనులకు బ్రేక్ ఎస్కేయూ: రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి నీతి అయోగ్ రూ. 20 కోట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తొలి విడత రూ. 10 కోట్లు అందిస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రకటించారు. అనుకన్నదే తడువుగానే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రూసా స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్‌కు పంపారు. ఇక్కడ నుండి ఆయా వర్సిటీలకు అందాల్సిన నిధులు అందివ్వాలి. నిధుల ఖర్చుకు సంబంధించి జవాబుదారీతనం.. పర్యవేక్షణ, నియంత్రణ, విధివిధానాలు, నియమ నిబంధనలు స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్. పీ.డీ) రూపొందించాలి. ఎస్.పీ.డీ పూర్తీగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తారు. నిధుల జారీలో జాప్యం ఉన్నత విద్యలో నమోదు శాతం పెంపుదల, వర్సిటీలు, కళాశాలల్లో భవనాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు అందించడానికి రూసా పథకాన్ని అమలు చేస్తోంది. నిర్ధిష్ట గడువులోగా నిధులు అందించడంతో పాటు.. నిర్ధారించిన పనులను సత్వరంగా చేపట్టి సకాలంలో పూర్తిచేయాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యం. అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ, పీజీలకు వెళ్లే వారి శాతం కేవలం 23 శాతం మాత్రమే ఉన్నట్లు రూసా గుర్తించింది. ఈ నమోదు శాతం ( డిగ్రీ, పీజీలు చదివే విద్యార్థుల సంఖ్య పెంచడం) పెంపుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నీతిఅయోగ్ గణనీయమైన మొత్తంలో రూ. 20 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 10 కోట్లు జారీ చేసినప్పటికీ .. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీడీ తమ వద్దే ఆ మొత్తాన్ని పెట్టుకోవడంతో రూసా పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే బ్లాక్ గ్రాంట్లు అరకొరగా ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిధులు సకాలంలో అందివ్వడంలో అలసత్వం వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా మౌలిక సదుపాయాల కల్పనలో వర్సిటీ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. పనుల జాబితాను పంపాము నిధులను ఏయే వాటికి ఖర్చు పెడుతున్నారనే అంశంపై ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం రూసా విభాగానికి ఇప్పటికే పంపాం. రెండు నూతన హాస్టళ్ల నిర్మాణం, ఒక ఇండోర్ స్టేడియం, డిజిటల్ తరగతులు, లైబ్రరీ డిజిటలైజేషన్, క్యాంటీన్ ఆధునీకరణ తదితర మౌలిక సదుపాయల కల్పనకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించాము. ఎస్.పీ.డీ అడిగిన అన్ని డ్యాక్యుమెంట్లు పంపాం. – ప్రొఫెసర్ ఎండీ బావయ్య, రూసా పథకం కోఆర్డినేటర్, ఎస్కేయూ -
చీటికి మాటికి ఇంటర్నెట్ నిలిపేస్తే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసుల్లో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అల్లర్లు జరుగకుండా నివారించేందుకు ముందు జాగ్రత్తగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అన్ని ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. అంతకు మూడు రోజుల ముందు ఆయన్ని దోషిగా నిర్ధారించినప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు ఇరు రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించవచ్చు. కానీ, ఈ మధ్య శాంతి భద్రతల పరిరక్షణ పేరిట చీటికి మాటికి టెలికాం సర్వీసులను, ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయి. డిజిటల్ లావా దేవీల రంగంలో భారత్ లాంటి దేశాలు తప్పనిసరై ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో పదే పదే ఈ సర్వీసులకు విఘాతం కల్పించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ 2017 సంవత్సరంలో ఇప్పటి వరకు 40 సార్లు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వ అధికారులు నిలిపివేశారని ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేతను పర్యవేక్షించే సంస్థ ‘సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్’ వెల్లడించింది. ఇంకా ఈ ఏడాదిలో నాలుగు నెలల కాలం మిగిలి ఉండగానే, అంటే ఎనిమిది నెలల కాలంలోనే 40 సార్లు ఈ సర్వీసులను నిలిపివేయడం మామూలు విషయం కాదు. అంతకుముందు రెండేళ్లలో నిలిపివేసిన దానికన్నా ఈ సంఖ్య ఎక్కువ. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీలసుల నిలిపివేత తగ్గాల్సిందిపోయి పెరగడం విచిత్రం. గతంలో కేంద్ర, రాష్ట్ర హోం కార్యదర్శిలకు మాత్రమే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసే అధికారాన్ని అప్పగించారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆ అధికారాన్ని ఇవ్వలేదు. అత్యవసర సమయాల్లో ఉన్నతాధికారులు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సందర్భాల్లో వారి నిర్ణయాన్ని 24 గంటల్లోగా సమీక్షించాలి. కారణం ఏమిటో తెలియదుగానీ అత్యవసర సమయాల్లో ఈ సర్వీసులను నిలిపివేసే అధికారాలను జాయింట్ సెక్రటరీ, ఆ పై స్థాయి అధికారులందరికి కట్టబెడుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆగస్టు ఏడవ తేదీన ఓ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటి నుంచి దేశంలో టెలికామ్ నియంత్రణ చట్టం కింద టెలికామ్, ఇంటర్నెట్ సర్వీసులను ఎప్పుడు పడితే అప్పుడు నిలిపివేస్తున్నారు. ఈ విధానాన్ని తక్షణమే మార్చాలి. ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేయడాన్ని మరింత కఠినతరం చేస్తూ నిబంధనలను తీసుకురావాలి. అవసరమైతే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయడాన్ని ప్రాథమిక హక్కుల భంగం కింద పౌరులు కేసులువేసి వాదించే పరిస్థితి ఉండాలని పలు ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. -
నిర్లక్ష్యపు చీకటికి శస్త్రచికిత్స!
♦ పెద్దాస్పత్రిలో దిద్దుబాటు చర్యలు ♦ విద్యుత్ సమస్యతో ఎలక్ట్రీషియన్ల తొలగింపు ♦ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ రద్దు ♦ ఆర్ఎంవోలకు షోకాజ్ నోటీసులు ♦ ఆసుపత్రిలో డీఎంఈ, జిల్లా కలెక్టర్ పర్యటన ♦ రేపు మంత్రి కామినేని రాక ఇంట్లోఆరోగ్యంగాఉన్నవారేఒక్కగంటపాటుకరెంటుపోతేతట్టుకోలేరు.ఉక్కపోతదోమలపోరుతోవిద్యుత్ఎప్పుడువస్తుందనిఎదురుచూడటంపరిపాటి.కానీఅనారోగ్యంతోఆసుపత్రిలోచేరిన రోగులు 12 నుంచి 15 గంటల పాటుకటిక చీకటిలో, ఉక్కపోతతో మగ్గాల్సివస్తే వారికి అది ప్రత్యక్ష నరకమే. విభేదాలతో ఆసుపత్రి అధికారులు, నిర్లక్ష్యంతో సిబ్బంది ప్రత్యక్షంగా రోగులకు ఇలాంటి నరకాన్నే చూపించారు. గాలి, వానకు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో రెండు రోజుల పాటు కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలలోవిద్యుత్ సరఫరాకు అంతరాయంఏర్పడింది. తక్షణమే స్పందించాల్సినఅధికారులు రాత్రంతా దరిదాపులకు రాలేదు. ఈ వ్యవహారంపై మంత్రికామినేని తీవ్రంగా స్పందించారు.మంత్రి ఆదేశాలతోశనివారం డీఎంఈడాక్టర్ సుబ్బారావు, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ..పెద్దాస్పత్రిని తనిఖీచేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తీవ్రంగాస్పందించారు.సంబంధిత అధికారులకు షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఈఘటనపైవిచారణ జరిపేందుకు సోమవారంమంత్రి కామినేని జిల్లాకు రానున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండురోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంది. గాలి, వానకు ఈ నెల 21వ తేది రాత్రి 8 గంటల నుంచి మరునాడు ఉదయం 8 గంటల వరకు, శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి రాత్రంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి ఆసుపత్రిలోని ట్రామాకేర్, మెడికల్వార్డులు, చిన్నపిల్లల విభాగం, న్యూరాలజి, ఎండోక్రైనాలజి, పీడియాట్రిక్ సర్జరీ విభాగాలల్లోని రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉక్కపోత, కటిక చీకటి, దోమకాటు వంటి సమస్యలతో వార్డు నుంచి బయటకు వచ్చేశారు. ఈ సమయంలో వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. మరమ్మతులు చేయాల్సిన ఎలక్ట్రీషియన్లు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి రెండు మొబైల్ జనరేటర్లను తెప్పించి రాత్రి 2 గంటల సమయంలో సరఫరాను పునరుద్ధరించారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఎలక్ట్రీషియన్లు వచ్చి మరమ్మతులు చేశారు. ఎలక్ట్రీషియన్లపై వేటు.. సమస్యకు బాధ్యులుగా చేస్తూ ముగ్గురు ఎలక్ట్రీషియన్లను విధుల నుంచి తొలగించారు. వీరిని నియమించిన ఏజెన్సీని రద్దు చేశారు. విద్యుత్‌సరఫరా, మరమ్మతుల బాధ్యతను తాత్కాలికంగా ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో ఇకపై విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్ స్తంభాలతో పాటు జంపర్లు కూడా పాతవై పోయాయన్నారు. వీటిని మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘పవర్’ రాజకీయంపై ఇంటెలిజెన్స్ ఆరా..! ఆసుపత్రిలో ‘పవర్’ రాజకీయం నడుస్తోందా అన్న కోణంలో ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు శనివారం ఆరా తీశారు. శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి ఒక్కరే పనులు చేయించారని, ఇతర అధికారులు ఎందుకు అక్కడికి రాలేదని ఆరా తీశారు. నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లున్నా ఏ ఒక్కరికీ అధికారాలు ఇవ్వలేదా...ఒకవేళ ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకోవడం లేదా అన్న కోణంలో పలువురు వైద్యులు, అధికారులను ఆరా తీశారు. దీనికితోడు ఇటీవలే ఏఆర్‌ఎంఓగా వచ్చిన డాక్టర్ వసుధను ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో డాక్టర్ పి. చంద్రశేఖర్ కార్డియాలజి విభాగానికి డిప్యూటేషన్‌పై నియమించుకున్నారు. అప్పటి నుంచి ఏఆర్ఎంఓ పదవిలో ఏ ఒక్కరూ విధులు నిర్వహించలేదని తెలుసుకున్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. సిబ్బంది రాత్రయినా సరే అరగంట నుంచి గంటలోపు పరిష్కరిస్తున్నారు. అలాంటిది ఏకంగా 12 గంటల పాటు పరిష్కరించకపోవడానికి కారణాలను ఎస్బీ పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. షోకాజ్ నోటీసులు.. పెద్దాసుపత్రిలో విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఎందుకు బాధ్యత తీసుకోలేదంటూ ఆసుపత్రి ఇన్చార్జి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు, ఏఆర్ఎంవో డాక్టర్ వసుధకు శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రేపు మంత్రి రాక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు సోమవారం మంత్రి కామినేని శ్రీనివాస్.. కర్నూలు రానున్నారు. మంత్రి కామినేని ఆగ్రహం.. ఆసుపత్రిలో సమస్య వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఎంఈ డాక్టర్ సుబ్బారావు, జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణను ఆదేశించారు. దీంతో వీరిద్దరూ శనివారం ఆసుపత్రిలో వేర్వేరు సమయాల్లో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ భార్గవరాముడిని వెంటపెట్టుకుని ఆసుపత్రిలో ఎక్కడకెక్కడ విద్యుత్ సమస్యలున్నాయో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. సమస్య పునరావృతం కాకుండా చర్యలు.. ఆసుపత్రిలోవిద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు డీఎంఈ సుబ్బారావు తెలిపారు. వచ్చే జూలైలో స్టేట్ క్యాన్సర్ సెంటర్‌కు అనుమతి వస్తుందన్నారు. డీఎంఈ, కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డిప్యూ టీ సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ విజయభాస్కర్, డీఈ మహేశ్వరరెడ్డి తదితరులున్నారు.