భ ‘రూసా’ అందేదెన్నడో ?
- రూసా పథకం కింద రూ.10 కోట్లు మంజూరు
- ఏడాదిగా ఎస్‌పీడీ దగ్గరే మూలుగుతున్న నిధులు
- పలు అభివృద్ధి పనులకు బ్రేక్
ఎస్కేయూ: రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి నీతి అయోగ్ రూ. 20 కోట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తొలి విడత రూ. 10 కోట్లు అందిస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రకటించారు. అనుకన్నదే తడువుగానే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రూసా స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్‌కు పంపారు. ఇక్కడ నుండి ఆయా వర్సిటీలకు అందాల్సిన నిధులు అందివ్వాలి. నిధుల ఖర్చుకు సంబంధించి జవాబుదారీతనం.. పర్యవేక్షణ, నియంత్రణ, విధివిధానాలు, నియమ నిబంధనలు స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్. పీ.డీ) రూపొందించాలి. ఎస్.పీ.డీ పూర్తీగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తారు.
నిధుల జారీలో జాప్యం
ఉన్నత విద్యలో నమోదు శాతం పెంపుదల, వర్సిటీలు, కళాశాలల్లో భవనాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు అందించడానికి రూసా పథకాన్ని అమలు చేస్తోంది. నిర్ధిష్ట గడువులోగా నిధులు అందించడంతో పాటు.. నిర్ధారించిన పనులను సత్వరంగా చేపట్టి సకాలంలో పూర్తిచేయాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యం. అనంతపురం జిల్లాలో ఇంటర్‌మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ, పీజీలకు వెళ్లే వారి శాతం కేవలం 23 శాతం మాత్రమే ఉన్నట్లు రూసా గుర్తించింది. ఈ నమోదు శాతం ( డిగ్రీ, పీజీలు చదివే విద్యార్థుల సంఖ్య పెంచడం) పెంపుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నీతిఅయోగ్ గణనీయమైన మొత్తంలో రూ. 20 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 10 కోట్లు జారీ చేసినప్పటికీ .. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌పీడీ తమ వద్దే ఆ మొత్తాన్ని పెట్టుకోవడంతో రూసా పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే బ్లాక్ గ్రాంట్‌లు అరకొరగా ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిధులు సకాలంలో అందివ్వడంలో అలసత్వం వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా మౌలిక సదుపాయాల కల్పనలో వర్సిటీ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు.
పనుల జాబితాను పంపాము
నిధులను ఏయే వాటికి ఖర్చు పెడుతున్నారనే అంశంపై ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం రూసా విభాగానికి ఇప్పటికే పంపాం. రెండు నూతన హాస్టళ్ల నిర్మాణం, ఒక ఇండోర్ స్టేడియం, డిజిటల్ తరగతులు, లైబ్రరీ డిజిటలైజేషన్, క్యాంటీన్ ఆధునీకరణ తదితర మౌలిక సదుపాయల కల్పనకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించాము. ఎస్.పీ.డీ అడిగిన అన్ని డ్యాక్యుమెంట్లు పంపాం.
– ప్రొఫెసర్ ఎండీ బావయ్య, రూసా పథకం కోఆర్డినేటర్, ఎస్కేయూ