చీటికి మాటికి ఇంటర్నెట్ నిలిపేస్తే ఎలా?
చీటికి మాటికి ఇంటర్నెట్ నిలిపేస్తే ఎలా?
Published Tue, Aug 29 2017 2:43 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసుల్లో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అల్లర్లు జరుగకుండా నివారించేందుకు ముందు జాగ్రత్తగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అన్ని ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. అంతకు మూడు రోజుల ముందు ఆయన్ని దోషిగా నిర్ధారించినప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు ఇరు రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించవచ్చు.
కానీ, ఈ మధ్య శాంతి భద్రతల పరిరక్షణ పేరిట చీటికి మాటికి టెలికాం సర్వీసులను, ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయి. డిజిటల్ లావా దేవీల రంగంలో భారత్ లాంటి దేశాలు తప్పనిసరై ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో పదే పదే ఈ సర్వీసులకు విఘాతం కల్పించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ 2017 సంవత్సరంలో ఇప్పటి వరకు 40 సార్లు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వ అధికారులు నిలిపివేశారని ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేతను పర్యవేక్షించే సంస్థ ‘సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్’ వెల్లడించింది. ఇంకా ఈ ఏడాదిలో నాలుగు నెలల కాలం మిగిలి ఉండగానే, అంటే ఎనిమిది నెలల కాలంలోనే 40 సార్లు ఈ సర్వీసులను నిలిపివేయడం మామూలు విషయం కాదు. అంతకుముందు రెండేళ్లలో నిలిపివేసిన దానికన్నా ఈ సంఖ్య ఎక్కువ.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీలసుల నిలిపివేత తగ్గాల్సిందిపోయి పెరగడం విచిత్రం. గతంలో కేంద్ర, రాష్ట్ర హోం కార్యదర్శిలకు మాత్రమే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసే అధికారాన్ని అప్పగించారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆ అధికారాన్ని ఇవ్వలేదు. అత్యవసర సమయాల్లో ఉన్నతాధికారులు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సందర్భాల్లో వారి నిర్ణయాన్ని 24 గంటల్లోగా సమీక్షించాలి. కారణం ఏమిటో తెలియదుగానీ అత్యవసర సమయాల్లో ఈ సర్వీసులను నిలిపివేసే అధికారాలను జాయింట్ సెక్రటరీ, ఆ పై స్థాయి అధికారులందరికి కట్టబెడుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆగస్టు ఏడవ తేదీన ఓ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటి నుంచి దేశంలో టెలికామ్ నియంత్రణ చట్టం కింద టెలికామ్, ఇంటర్నెట్ సర్వీసులను ఎప్పుడు పడితే అప్పుడు నిలిపివేస్తున్నారు.
ఈ విధానాన్ని తక్షణమే మార్చాలి. ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేయడాన్ని మరింత కఠినతరం చేస్తూ నిబంధనలను తీసుకురావాలి. అవసరమైతే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయడాన్ని ప్రాథమిక హక్కుల భంగం కింద పౌరులు కేసులువేసి వాదించే పరిస్థితి ఉండాలని పలు ప్రజా సంఘాలు భావిస్తున్నాయి.
Advertisement