ప్రజలను సముదాయిస్తున్న డీటీ, ఎస్సై
సిరికొండ(బోథ్) : మండల కేంద్రంలోని బోయివాడ కాలనీ సమీపంలో మంగళవారం శ్మశాన వాటికలో కొద్దిసేపు హైడ్రామా సాగింది. వివరాలు.. బోయివాడ కాలనీ సమీపంలో ఉన్న శ్మశాన వాటిక స్థలం కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. శ్మశాన వాటిక స్థలం తనదంటున్న ఓ వ్యక్తికి కాలనీవాసులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారం కాకుండానే సదరు వ్యక్తి ఆ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. స్థలాన్ని తిరిగి గ్రామస్తులకు అప్పగించాలని కాలనీవాసులు స్థానిక తహసీల్దార్, కలెక్టర్‌కు పలుసార్లు ఫిర్యాదులు చేశారు. ఈమేరకు అధికారులు ఆ స్థలాన్ని సర్వే చేసి ఎవరికి అప్పగించకుండా ఉంచారు.
మంగళవారం బోయివాడ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ సభ్యులు వివాద స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన కంచె నిర్మించిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాల మధ్య గంటకుపైగా వివాదం చెలరేగింది. పోలీసులు, తహసీల్దార్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. దీంతో పరిస్థితి సద్దుమనిగింది. ఆ స్థలం ఎవరిదో మరోసారి విచారణ చేసి పరిష్కరిస్తామని ఎస్సై రామగౌడ్, డెప్యూటీ తహసీల్దార్ త్రియంబక్‌రావు హామీ ఇచ్చారు. దీంతో ఆ సదరు వ్యక్తి ఒప్పుకోవడంతో మృతుడి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment