న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి చాలాసేపు జీమెయిల్ సహా గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ మొదలైన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. లాగిన్ కాలేకపోవడం, అటాచ్‌మెంట్స్ చేయలేకపోవడం, మెసేజ్‌లు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
జీమెయిల్ హ్యాష్‌ట్యాగ్ చాలాసేపు ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిల్చింది. మరోవైపు, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఉదయం వెల్లడించిన గూగుల్ ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు సాయంత్రానికి ప్రకటించింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఓర్పు వహించినందుకు, మద్దతుగా నిల్చినందుకు ధన్యవాదాలు. వ్యవస్థ విశ్వసనీయతకు గూగుల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఎప్పటికప్పుడు మా వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నాం‘ అని పేర్కొంది.
సర్వీసులకు అంతరాయం కలగడంపై దర్యాప్తు చేస్తున్నట్లు తమ సేవల వివరాలను తెలియజేసే ’జీ సూట్’ స్టేటస్ డ్యాష్‌బోర్డు ద్వా రా ఉదయమే గూగుల్ వెల్లడించింది. కొందరు యూజర్లకు సర్వీసులను పునరుద్ధరించినట్లు, మిగతా యూజర్ల సమస్యలనూ సత్వరం పరిష్కరించనున్నట్లు పేర్కొంది. గూగుల్ వివరణ ప్రకారం.. ఈ–మెయిల్స్, మీట్ రికార్డింగ్, డ్రైవ్‌లో ఫైల్స్ క్రియేట్ చేయడం, గూగుల్ చాట్‌లో మెసేజ్‌లు పోస్ట్ చేయడం వంటి అంశా ల్లో సమస్యలు తలెత్తాయి. అయితే, సేవల అంతరాయానికి కారణమేంటన్నది తెలియరాలేదు. కంపెనీ నిర్దిష్టంగా వివరాలు వెల్లడించనప్పటికీ డౌన్‌డిటెక్టర్ (వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల సేవల్లో అంతరాయాల వివరాలను తెలిపే సంస్థ) డేటా ప్రకారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా యూజర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment