సాక్షి, విశాఖపట్నం: మంచి వర్షాలు అందించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ.. మరో చల్లని కబురు అందింది. నైరుతి మాదిరిగానే ఈశాన్య రుతుపవనాలు కూడా ముందే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా అక్టోబర్ చివరి వారంలో రావాల్సిన ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది అక్టోబర్ మూడో వారంలోనే రానున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈశాన్య రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంపై మంచి ప్రభావమే చూపించాయి. 13 జిల్లాలోనూ మంచి వర్షాలు కురిశాయి. ఏడు జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 560 మిల్లీమీటర్లు. ఈ కాలంలో ఈ ఏడాది 8.77 శాతం అధికంగా మొత్తం 609.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరులో 49 శాతం అధికంగా వర్షాలు కురవగా విశాఖపట్నంలో 37, విజయనగరంలో 36, గుంటూరులో 33, వైఎస్సార్ కడపలో 32, తూర్పు గోదావరిలో 29, కృష్ణా జిల్లాలో 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
రెండురోజులు తేలికపాటి వానలు
ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో పెనమలూరులో 63.8 మీల్లీమీటర్లు, వేటపాలెంలో 58.5, మచిలీపట్నంలో 55.6, రాజమండ్రిలో 54.8, మంగళగిరిలో 51, టి.నర్సాపురంలో 49, తణుకులో 48.8, ఒంగోలులో 45.6, పెడనలో 43.8, చింతలపూడిలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ముందే ఈశాన్య రుతుపవనాలు
Published Fri, Oct 1 2021 2:36 AM | Last Updated on Fri, Oct 1 2021 2:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment