
దక్షిణ బంగాళాఖాతంలో 12న ఉపరితల ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైన క్రమంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాస్తవానికి ఏటా అక్టోబర్ 20న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతుంటాయి. ఈసారి చురుగ్గా ముందుకు కదులుతుండటంతో.. 15 నాటికి దక్షిణ కోస్తాలోకి వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు జోరందుకోనున్నాయని వెల్లడించారు.
మరోవైపు.. దక్షిణ బంగాళాఖాతంలో ఈనెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 16 నాటికి బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే.. దీని ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉండే సూచనలున్నాయని చెప్పారు.
ప్రస్తుతం కేరళ, తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయనీ.. అదేవిధంగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
