‘నైరుతి’ నిష్క్రమణ షురూ  | Moderate rains for next two days in Telangana | Sakshi
Sakshi News home page

‘నైరుతి’ నిష్క్రమణ షురూ 

Published Tue, Sep 26 2023 4:52 AM | Last Updated on Tue, Sep 26 2023 4:32 PM

Moderate rains for next two days in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమవుతోంది. సాధారణంగా సెప్టెంబర్‌ మూడో వారం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలై అక్టోబర్‌ రెండో వారం నాటికి పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది నైరుతి రాక ఆలస్యమైంది. జూన్‌ నాలుగో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు మందకొడిగానే కదలడం వల్ల సాదాసీదా వర్షాలే పడ్డాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం రాజస్తాన్‌లో ప్రారంభమవగా వచ్చే నెల 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భారత వాతావరణ విభాగం వర్గాలు చెబుతున్నాయి. 

సాధారణ వర్షాలతోనే సగటును దాటి... 
ఈసారి నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో కేవలం నాలుగు అల్పపీడనాలే ఏర్పడ్డాయి. అవి కూడా స్వల్పంగానే ప్రభావం చూపడంతో భారీ వర్షాలు నమోదు కాలేదు. వాయుగుండాలు, తుపానులు ఏర్పడితే సమృద్ధిగా వానలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో ఒక్క వాయుగుండం లేదా తుపాను కూడా ఏర్పడలేదు. దీంతో రాష్ట్రంలో ఈ సీజన్‌ సాధారణ వర్షాలతోనే ముగుస్తోంది.

నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో భాగంగా ఈ నెల 25 నాటికి 71.73 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 84.01 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 17 శాతం అధికంగా వర్షాలు కురిసినప్పటికీ అతితక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడంతో డ్రైస్పెల్స్‌ (వర్షాల మధ్య అంతరం) ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

ఈ సమయంలోనూ వర్షాలు 
నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలకు ఆస్కారం ఉంటుందని... రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటే భారీ వార్షాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలా తిరోగమనంలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో మరింత సమృద్ధిగా వర్షపాతం గణాంకాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

తిరగమన ప్రభావం వచ్చే నెల 15 వరకు ఉంటుందని, అప్పటివరకు వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. నైరుతి ఉత్తరప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement