
తిరువనంతపురం సమీప గ్రామంలో మేఘావృతమైన ఆకాశం
తిరువనంతపురం/న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ, ఆర్థిక రంగాలకు ఎంతో కీలకమైన నైరుతి రుతు పవనాలు ఈ సీజన్‌లో ముందుగానే కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ ఒకటో తేదీన రావాల్సిన రుతు పవనాలు ఈసారి మూడు రోజులు ముందుగానే కేరళలో ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి కేరళలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 14 వాతావరణ పరిశీలన కేంద్రాలకు గాను పదింటి పరిధిలో 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
రుతు పవనాల రాక ప్రారంభమైందనేందుకు ఇదే ప్రధాన సంకేతమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో బలమైన పశ్చిమ గాలులు వీస్తుండటం కూడా రుతు పవనాల ఆగమనానికి సూచిక అని ఆయన తెలిపారు. కేరళలో రుతు పవనాల ప్రారంభానికి ఇతర అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రాక మొదలైనప్పటికీ బంగాళాఖాతంలో అండమాన్ దీవులపైన పవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని మహాపాత్ర చెప్పారు.
దీనివల్ల, కర్ణాటక, గోవా, ఈశాన్య భారతంలోకి రుతు పవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కానుందని అంచనా వేశారు. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కేరళ మొత్తం,, తమిళనాడు, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతు పవనాలు వ్యాపించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో జూన్ 8వ తేదీ వరకు సాధారణం, అంతకంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయన్నారు. కాగా, తెలంగాణ మినహా అన్ని దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి–మే 28 మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment