season started
-
మూడు రోజుల ముందే నైరుతి
తిరువనంతపురం/న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ, ఆర్థిక రంగాలకు ఎంతో కీలకమైన నైరుతి రుతు పవనాలు ఈ సీజన్లో ముందుగానే కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ ఒకటో తేదీన రావాల్సిన రుతు పవనాలు ఈసారి మూడు రోజులు ముందుగానే కేరళలో ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి కేరళలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 14 వాతావరణ పరిశీలన కేంద్రాలకు గాను పదింటి పరిధిలో 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రుతు పవనాల రాక ప్రారంభమైందనేందుకు ఇదే ప్రధాన సంకేతమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో బలమైన పశ్చిమ గాలులు వీస్తుండటం కూడా రుతు పవనాల ఆగమనానికి సూచిక అని ఆయన తెలిపారు. కేరళలో రుతు పవనాల ప్రారంభానికి ఇతర అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రాక మొదలైనప్పటికీ బంగాళాఖాతంలో అండమాన్ దీవులపైన పవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని మహాపాత్ర చెప్పారు. దీనివల్ల, కర్ణాటక, గోవా, ఈశాన్య భారతంలోకి రుతు పవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కానుందని అంచనా వేశారు. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కేరళ మొత్తం,, తమిళనాడు, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతు పవనాలు వ్యాపించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో జూన్ 8వ తేదీ వరకు సాధారణం, అంతకంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయన్నారు. కాగా, తెలంగాణ మినహా అన్ని దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి–మే 28 మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు. -
నేటి నుంచి దులీప్ ట్రోఫీ సమరం
దిండిగుల్ (తమిళనాడు): భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018–19)కు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ మ్యాచ్‌లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా ‘రెడ్’కు అభినవ్ ముకుంద్ సారథి కాగా... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్, ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్‌లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఆటకు దూరమవ డంతో... అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్‌పుత్, జైదేవ్ ఉనాద్కట్‌లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా ‘బ్లూ’ జట్టుకు, పృథ్వీరాజ్ ‘రెడ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా... సాక్షి, విజయవాడ: ఆస్ట్రేలియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’లతో పాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో నేడు, రేపు జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఈ నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. -
వానమ్మా.. రావమ్మా
జగిత్యాల అగ్రికల్చర్/జమ్మికుంట : వర్షాలు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క భారీ వర్షం కూడా కురవకపోగా... జిల్లాలో చినుకు జాడ లేక 20 రోజులు దాటింది. జిల్లాలో జూన్ నెలలో 128 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 79.8 శాతం అధికంగా 230.2 మిమీ కురిసింది. నైరుతీ రుతుపవనాలు ప్రవేశించిన కాలంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఖరీఫ్ మొదట్లోనే వర్షాలు ఊరించడంతో అన్నదాతలు సాగు మొదలెట్టారు. చాలా చోట్ల విత్తనాలు విత్తారు. అల్పపీడనం పోతూపోతూ రుతుపవనాలను కూడా తీసుకెళ్లడంతో వర్షాలు వారం రోజులకే పరిమితం కాగా, కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తాయి. తక్కువ వర్షపాతం నమోదైన చోట్ల మొలకెత్తలేదు. 20 శాతం మేర విత్తనాలు భూమిలోనే మురిగిపోయాయి. మొలకెత్తిన మొక్కలు కూడా వాడిపోతున్నాయి. జూలైపైనే ఆశలు జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఆశలన్నీ జూలైపైనే ఉన్నాయి. కానీ, ఈ నెలలో 10 రోజులు గడిచినా ఇప్పటివరకు చినుకు జాడే లేదు. 2011లో 207.8 మిమీ, 2012లో 382.3 మిమీ, 2013లో 355.8 మిమీ వర్షం కురవగా గతేడాది అత్యంత స్వల్పంగా 119.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూలైలో ఇప్పటివరకు చుక్క వర్షం పడలేదు. చెరువుల్లోకి ఎక్కడా పెద్దగా నీరు చేరలేదు. సాధారణంగా నైరుతీ రుతుపవనాల కాలంలో జూలై, ఆగస్టు నెలల్లోనే అధిక వర్షాలు కురుస్తాయి. ఈ నెలలో వర్షం కురవకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదముంది. 20 రోజుల క్రితం విత్తిన విత్తనాలు మొలకెత్తి ఆకులు వచ్చాయి. ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోయి ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరా సాగు కోసం రైతులు రూ.15 వేల వరకు ఖర్చుపెట్టారు. వర్షాలు కురవకపోతే మళ్లీ దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం తదితర పనులతో పెట్టబడి రెండింతలయ్యే పరిస్థితి ఉంది. గతేడాది అనావృష్టి, అతివృష్టితో నష్టపోయిన రైతులకు ఇది శరాఘాతమే. దేవుళ్లపై భారం! విత్తనాలు వేసిన రైతులు, దుక్కి సిద్ధం చేసుకుని విత్తనాలు వేసేందుకు ఎదురు చూస్తున్న రైతులు వర్షాల కోసం కనిపించిన దేవుళ్లనల్లా మొక్కుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో డప్పుచప్పుళ్ల మధ్య కప్పతల్లుల ఆటలు, దేవాలయాల్లో ఇంటికో బిందె చొప్పున జలాభిషేకాలు చేస్తున్నారు. అయినప్పటికీ వరుణుడు కరుణ చూపించడం లేదు. బావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లను పంపుసెట్లు, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పారిస్తూ మొలకలు కాపాడుకునేందుకు రైతులు నానాయాతన పడుతున్నారు. పత్తిని కాపాడుకోండిలా... : చత్రునాయక్, జేడీఏ పత్తి మొలకలకు యూరియాను నీళ్లలో కలిపి పిచికారి చేయాలి. చెట్లపైనుంచి పిచికారి చేస్తే వారం రోజులు మొలకలకు ఢోకా ఉండదు. పూర్తి వివరాల కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోండి. దుఃఖం వస్తంది -బొంతల పెద్దకొంరయ్య, రైతు గట్ల నర్సింగాపూర్ నాకు మూడెకరాల భూమి ఉంది. బాయి ఉంది. 20 రోజుల కిందట 8 వేల రూపాయలు పెట్టి పత్తి బస్తాలు కొని గింజలు పెట్టిన. ఆఠాణ మందం మొలవలేదు. వానలు లేవు. మొలిచిన మొక్కలకు నీళ్లు కడదామనాన బాయిల నీళ్లు లేవు. గింజలకు 8 వేలు, దున్నుడు కూళ్లకు 6 వేలు, పత్తి గింజలు పెట్టినందుకు వెయ్యి, పిండి బస్తాలకు 6వేలు ఖర్చయినయ్. 30 వేలు అప్పు జేసిన. వర్షాలు మంచిగ పడ్డయిగదా అప్పు తీర్చచ్చు అనుకుని విత్తనాలేసిన. ఇప్పుడు అసలుకే ఎసరచ్చింది. గిట్లనే కాలం ఉంటే పెట్టుబడి కూడా మునుగుడే. ఇగ బతుకుడెట్లనో... ఏమో! -భీమదేవరపల్లి