క్వాడ్రాంగులర్’ టోర్నీ ట్రోఫీతో నాలుగు జట్ల కెప్టెన్లు
దిండిగుల్ (తమిళనాడు): భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018–19)కు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ మ్యాచ్‌లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా ‘రెడ్’కు అభినవ్ ముకుంద్ సారథి కాగా... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్, ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్‌లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఆటకు దూరమవ డంతో... అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్‌పుత్, జైదేవ్ ఉనాద్కట్‌లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా ‘బ్లూ’ జట్టుకు, పృథ్వీరాజ్ ‘రెడ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రెండు రోజులు ఆలస్యంగా...
సాక్షి, విజయవాడ: ఆస్ట్రేలియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’లతో పాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో నేడు, రేపు జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఈ నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment