జగిత్యాల అగ్రికల్చర్/జమ్మికుంట : వర్షాలు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క భారీ వర్షం కూడా కురవకపోగా... జిల్లాలో చినుకు జాడ లేక 20 రోజులు దాటింది. జిల్లాలో జూన్ నెలలో 128 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 79.8 శాతం అధికంగా 230.2 మిమీ కురిసింది. నైరుతీ రుతుపవనాలు ప్రవేశించిన కాలంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఖరీఫ్ మొదట్లోనే వర్షాలు ఊరించడంతో అన్నదాతలు సాగు మొదలెట్టారు. చాలా చోట్ల విత్తనాలు విత్తారు. అల్పపీడనం పోతూపోతూ రుతుపవనాలను కూడా తీసుకెళ్లడంతో వర్షాలు వారం రోజులకే పరిమితం కాగా, కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తాయి. తక్కువ వర్షపాతం నమోదైన చోట్ల మొలకెత్తలేదు. 20 శాతం మేర విత్తనాలు భూమిలోనే మురిగిపోయాయి. మొలకెత్తిన మొక్కలు కూడా వాడిపోతున్నాయి.
జూలైపైనే ఆశలు
జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఆశలన్నీ జూలైపైనే ఉన్నాయి. కానీ, ఈ నెలలో 10 రోజులు గడిచినా ఇప్పటివరకు చినుకు జాడే లేదు. 2011లో 207.8 మిమీ, 2012లో 382.3 మిమీ, 2013లో 355.8 మిమీ వర్షం కురవగా గతేడాది అత్యంత స్వల్పంగా 119.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూలైలో ఇప్పటివరకు చుక్క వర్షం పడలేదు. చెరువుల్లోకి ఎక్కడా పెద్దగా నీరు చేరలేదు.
సాధారణంగా నైరుతీ రుతుపవనాల కాలంలో జూలై, ఆగస్టు నెలల్లోనే అధిక వర్షాలు కురుస్తాయి. ఈ నెలలో వర్షం కురవకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదముంది. 20 రోజుల క్రితం విత్తిన విత్తనాలు మొలకెత్తి ఆకులు వచ్చాయి. ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోయి ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరా సాగు కోసం రైతులు రూ.15 వేల వరకు ఖర్చుపెట్టారు. వర్షాలు కురవకపోతే మళ్లీ దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం తదితర పనులతో పెట్టబడి రెండింతలయ్యే పరిస్థితి ఉంది. గతేడాది అనావృష్టి, అతివృష్టితో నష్టపోయిన రైతులకు ఇది శరాఘాతమే.
దేవుళ్లపై భారం!
విత్తనాలు వేసిన రైతులు, దుక్కి సిద్ధం చేసుకుని విత్తనాలు వేసేందుకు ఎదురు చూస్తున్న రైతులు వర్షాల కోసం కనిపించిన దేవుళ్లనల్లా మొక్కుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో డప్పుచప్పుళ్ల మధ్య కప్పతల్లుల ఆటలు, దేవాలయాల్లో ఇంటికో బిందె చొప్పున జలాభిషేకాలు చేస్తున్నారు. అయినప్పటికీ వరుణుడు కరుణ చూపించడం లేదు. బావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లను పంపుసెట్లు, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పారిస్తూ మొలకలు కాపాడుకునేందుకు రైతులు నానాయాతన పడుతున్నారు.
పత్తిని కాపాడుకోండిలా... :
చత్రునాయక్, జేడీఏ
పత్తి మొలకలకు యూరియాను నీళ్లలో కలిపి పిచికారి చేయాలి. చెట్లపైనుంచి పిచికారి చేస్తే వారం రోజులు మొలకలకు ఢోకా ఉండదు. పూర్తి వివరాల కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోండి.
దుఃఖం వస్తంది
-బొంతల పెద్దకొంరయ్య, రైతు
గట్ల నర్సింగాపూర్
నాకు మూడెకరాల భూమి ఉంది. బాయి ఉంది. 20 రోజుల కిందట 8 వేల రూపాయలు పెట్టి పత్తి బస్తాలు కొని గింజలు పెట్టిన. ఆఠాణ మందం మొలవలేదు. వానలు లేవు.
మొలిచిన మొక్కలకు నీళ్లు కడదామనాన బాయిల నీళ్లు లేవు. గింజలకు 8 వేలు, దున్నుడు కూళ్లకు 6 వేలు, పత్తి గింజలు పెట్టినందుకు వెయ్యి, పిండి బస్తాలకు 6వేలు ఖర్చయినయ్. 30 వేలు అప్పు జేసిన. వర్షాలు మంచిగ పడ్డయిగదా అప్పు తీర్చచ్చు అనుకుని విత్తనాలేసిన. ఇప్పుడు అసలుకే ఎసరచ్చింది. గిట్లనే కాలం ఉంటే పెట్టుబడి కూడా మునుగుడే. ఇగ బతుకుడెట్లనో... ఏమో!
-భీమదేవరపల్లి
వానమ్మా.. రావమ్మా
Published Sun, Jul 12 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement