పురుగుల దాడి ఎక్కువే... జాగ్రత్త
పాడి-పంట: కడప అగ్రికల్చర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల రైతులు ఇప్పటికే వేరుశనగ విత్తనాలు వేసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని కొందరు ఇప్పుడిప్పుడే విత్తనాలు విత్తుతున్నారు. అయితే ఈ పైరుపై చీడ పురుగుల దాడి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే దిగుబడులు దెబ్బతింటాయని వైఎస్సార్ జిల్లా ఊటుకూరు కృషి విజ్జాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేరుశనగ పైరులో చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలపై ఆయన అందిస్తున్న సూచనలు...
వర్షాధార పైరులో...
వర్షాధార వేరుశనగ పైరులో ఎర్ర గొంగళి పురుగు తాకిడి అధికంగా ఉంటుంది. పెద్ద పురుగులు చాలా చురుకుగా నేల మీద పాకుతూ గుంపులు గుంపులుగా పంటను తినేస్తాయి. ఈ పురుగు నివారణకు... నేల తడిసేలా వర్షం పడిన మరుసటి రోజు నుంచి 3-4 రోజుల పాటు పొలం గట్ల వద్ద రాత్రి వేళ 7-11 గంటల మధ్య మంటలు వేయాలి. రెక్కల పురుగులు అక్కడికి వచ్చి మంటలో పడి చనిపోతాయి. గుడ్ల సముదాయం, చిన్న పురుగులు ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. పొలం చుట్టూ లోతుగా గాడి తీసి, అందులో 2% మిథైల్ పారాథియాన్ పొడిని వేయాలి.
పొలంలో, గట్ల మీద అక్కడక్కడ జిల్లేడు, అడవి ఆముదం కొమ్మలను (ఆకులతో ఉన్న) వేస్తే గొంగళి పురుగులు వాటి పైకి చేరతాయి. ఆ తర్వాత కొమ్మలను ఒక చోటికి చేర్చి, చెత్త వేసి కాల్చేయాలి. ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారీ చేసుకుంటే పురుగు గుడ్లు, పిల్ల పురుగులు నశిస్తాయి. ఎదిగిన పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
వేరు పురుగు చేరి...
వేరు పురుగు తెల్లగా, లద్దె పురుగు మాదిరిగా ఉంటుంది. ఇది భూమిలో దాగి ఉంటూ మొక్కల వేర్లను కొరికి తినేస్తుంది. దీంతో మొక్కలు చనిపోతాయి. ఈ పురుగును నివారించాలంటే విత్తనాలు విత్తడానికి ముందే ఎకరానికి 5 కిలోల ఫోరేట్ గుళికలు వేసుకోవాలి. లేకుంటే కిలో విత్తనాలకు 6 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ పట్టించి శుద్ధి చేయాలి. ఫోరేట్ గుళికలు వేరు పురుగులను నివారించడంతో పాటు రసం పీల్చే పురుగులు, చెదల బారి నుంచి పైరును 30 రోజుల వరకూ కాపాడతాయి.
రసాన్ని పీలుస్తాయి
రసం పీల్చే పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు వేరుశనగ పైరుకు అపార నష్టం కలిగిస్తాయి. పచ్చదోమ దాడి చేస్తే ఆకులు పసుపు రంగుకు మారతాయి. ఆకు చివరి భాగాలు క్రమేపీ ఇంగ్లీషు ‘వి’ ఆకారంలో ఎరుపు రంగుకు మారి కాలినట్లు కన్పిస్తాయి. తామర పురుగులు ఆశిస్తే ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగులు లేత ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. అంతేకాదు... తామర పురుగులు మొవ్వుకుళ్లు, కాండంకుళ్లు వైరస్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. పంట ఎదుగుదల కూడా తగ్గుతుంది. పేనుబంక తల్లి, పిల్ల పురుగులు కొమ్మల చివర్లలో, లేత ఆకుల అడుగు భాగంలో, పూత పైన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తుంటాయి. దీనివల్ల మొక్కలు వడలిపోయి గిడసబారతాయి. ఈ పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల నల్లని శిలీంద్రాలు ఆశించి, పూత రాలిపోతుంది.
కిలో విత్తనాలకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేసుకుంటే పంటను తొలి దశలో రసం పీల్చే పురుగులు ఆశించవు. పైరులో పురుగులు కన్పించినట్లయితే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 15-20 రోజుల తర్వాత ఈ మందును పిచికారీ చేసినట్లయితే వైరస్ తెగుళ్ల వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు. పేనుబంక నివారణకు 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవచ్చు.
ఆలస్యంగా విత్తినప్పుడు...
వేరుశనగ విత్తనాలను ఆలస్యంగా వేసినప్పుడు లేదా పైరు ఎక్కువ రోజులు బెట్టకు గురైనప్పుడు ఆకుముడత పురుగులు ఆశిస్తాయి. తల్లి పురుగు ఆకు అడుగు భాగంలో మధ్య ఈనెకు దగ్గరగా గుడ్లు పెడుతుంది. వాటి నుంచి బయటికి వచ్చిన పిల్ల పురుగులు ఆకు పొరల్లో చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివల్ల ఆకు పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. పురుగులు పెద్దవవుతూ రెండు మూడు ఆకులను గూడుగా చేసుకొని పత్రహరితాన్ని తినేస్తుంటాయి. దీంతో ఆకులు మాడినట్లు కన్పిస్తాయి.
పప్పు జాతి పైర్లతో పంట మార్పిడి చేసుకుంటే ఆకుముడత పురుగు తాకిడి ఉండదు. రా త్రి వేళల్లో పొలంలో దీపపు ఎరలను ఏర్పాటు చేస్తే రెక్కల పురుగులు అక్కడికి వచ్చి వాటిలో పడి చనిపోతాయి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.