కదలని కాడి | rains | Sakshi
Sakshi News home page

కదలని కాడి

Published Sun, Jul 5 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

rains

కొరిటెపాడు(గుంటూరు): చినుకు రాలుతుందో లేదోననే చింత.. నకిలీ విత్తనాలు ఎక్కడ కొంప ముంచుతాయోననే బెంగ.. పంట ఎదిగి వస్తుంటే ఎరువుల కొరతతో సతమతం.. ఆశల జూదంలో రైతన్నకు అన్నీ కష్టాలే! ఖరీఫ్ సీజన్ మొదలవడంతో ప్రధాన పెట్టుబడి సమస్య ముప్పుతిప్పలు పెడుతోంది. అన్నదాత ఆశలన్నీ ఇక బ్యాంకర్ల చేయూత పైనే. ఖరీఫ్ మొదలైంది. రైతులకు పెట్టుబడి సమస్య ఆరంభమైంది. ఇప్పటికీ బ్యాంకులు పంట రుణాల పంపిణీ ఊసెత్తలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం వుంది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి.
 
  రైతులకు పెట్టుబడికూడా దక్కని పరిస్థితి. ఈ సారైనా వర్షాలు పడకపోతాయా.. పంటలు పండక పోతాయా అనే ఆశతో రైతులు ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల వైపు ఆశగా చూస్తున్నారు. గత ఏడాది రుణమాఫీ వల్ల బ్యాంకులు పంట రుణాలు పంపిణీని అటకెక్కించారు. ఇప్పుడు రుణమాఫీ సమస్యలు కొంత వరకు తీరిపోయాయి. అయినప్పటికీ బ్యాంకులు ఇతోధికంగా రైతులకు ఆదుకుంటాయా అనేది అనుమానంగా మారింది.
 
 లక్ష్యం మేరకు పంపిణీ జరిగేనా..?
 గత ఏడాది ఖరీఫ్‌లో రూ.3,797 కోట్లు పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా 95,420 మంది రైతులకు రూ.980 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.4,405 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. పంటరుణాల పంపిణీలో జీడీసీసీబీ, సీజీజీబీ, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌ల పాత్ర కీలకం. ఈ బ్యాంకులు ముందుకొస్తే లక్ష్యాన్ని అధిగమించడం సమస్యేమీ కాదు. ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు పంటరుణాల పంపిణీ మొదలేకాకపోవడంతో.. ఈ సారికూడా రైతులు పెట్టుబడులకోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.
 
 పంపిణీ నామమాత్రమే..
 2014-15 ఖరీఫ్ ఖరీఫ్‌లో రూ.3797 కోట్లు, రబీలో రూ.2531.43 కోట్లు లక్ష్యంకాగా, కేవలం 1,000 కోట్లు పంపిణీతో సరిపెట్టారు. ఇందులోనూ కొత్త రుణాల ఊసే లేకపోయింది. కేవలం పాత రుణాలను రెన్యువల్ చేసి బ్యాంకర్లు రుణాలు ఇచ్చినట్లు ప్రకటించుకున్నారు.
 నాన్‌లోనీ ఫార్మర్స్ ఎక్కువే..
 జిల్లాలో సుమారు ఎనిమిది లక్షలకుపైగా రైతులు ఉన్నారు. ఇందులో బ్యాంకులకు వెళ్లి పంటరుణాలు తీసుకున్న రైతులు నాలుగులక్షలు మంది మాత్రమే. బ్యాంకులకు వెళ్లని రైతులు మరో నాలుగు లక్షల మంది ఉన్నారు. వీరందరినీ గుర్తించి బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించాల్సి వుంది. కానీ ఈ ఏడాది 4,962 కేవలం మందిని మాత్రమే నాన్‌లోనీ ఫార్మర్స్‌గా గుర్తించారు.
 
 కౌలు రైతులను పట్టించుకోని బ్యాంకులు...
 కౌలు రైతులను బ్యాంకులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. గత ఏడాది 34,099 మంది రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయగా, వీరిలో  కేవలం 250 మంది కౌలు రైతులకు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది 2.30 లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం 10 వేల మందికి కార్డులు అందజేశారు. ఈ సారైనా కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా? లేదా ? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement