సాక్షి, విశాఖపట్నం/అమరావతి: నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ఏటా సాధారణంగా జూన్ 1వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అయితే.. ఈ ఏడాది ఒకింత ఆలస్యంగా జూన్ 4 నాటికి కేరళను తాకుతాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది. కానీ ‘నైరుతి’ కేరళను తాకకుండా దోబూచులాడుతూనే ఉంది. వాస్తవానికి రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి మే 20–22 మధ్య ప్రవేశిస్తాయి.
అనంతరం నాలుగైదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలతో పాటు పరిసర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అక్కడ నుంచి జూన్ 1వ తేదీకి కేరళను తాకుతాయి. కానీ.. ఈ ఏడాది అండమాన్ సముద్రంలోకి సకాలంలో అంటే మే 20 నాటికే ప్రవేశించాయి. కానీ.. అప్పటినుంచి వాటి విస్తరణలో మాత్రం మందగమనం చోటుచేసుకుంటోంది.
ఫలితంగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి జాప్యం జరుగుతోంది. దీంతో ఐఎండీ ముందుగా ఊహించినట్టుగా జూన్ 4వ తేదీ కంటే మరో నాలుగైదు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయి. అంటే సాధారణం కంటే వారం రోజుల ఆలస్యంగా ఇవి కేరళలోకి ప్రవేశించనున్నాయి.
ఆలస్యం ఎందుకంటే..!
నైరుతి రుతుపవనాల ఆగమనంలో జాప్యానికి గత నెలలో సంభవించిన ‘మోచా’ తుపాను, ఉత్తరాదిన ఏర్పడిన పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను ఆ తర్వాత అత్యంత తీవ్ర తుపానుగా మారి 15న బంగ్లాదేశ్, మయన్మార్‌ల మధ్య తీరాన్ని దాటింది. దీంతో ఈ తుపాను బంగాళాఖాతంలోని తేమను మయన్మార్ వైపు లాక్కెళ్లిపోయింది.
మరోవైపు కొద్దిరోజుల నుంచి ఉత్తరాదిన వెస్టర్న్ డిస్టర్బెన్స్‌లు చురుగ్గా ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి దిగువన బంగాళాఖాతంపై ఉన్న తూర్పు గాలులను బలహీన పరిచాయి. ఫలితంగా అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు విస్తరించడకుండా వెస్టర్న్ డిస్టర్బెన్స్ అడ్డుపడుతున్నాయి. ఈ కారణాల వల్ల నైరుతి రుతుపవనాలు సకాలంలో కేరళలోకి ప్రవేశించకుండా జాప్యానికి కారణమయ్యాయని వాతావరణ శాఖ మాజీ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు.
కొన్నాళ్లు ఎండలు.. వానలు!
రుతుపవనాల రాక ఆలస్యం కానుండటంతో రాష్ట్రంలో ఉష్ణతాపం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి మరో 10 రోజులు పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. అప్పుడప్పుడూ వడగాడ్పులకు ఆస్కారం ఉంది.
అదే సమయంలో మధ్యమధ్యలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రుతుపవనాల ఆగమనానికి ముందు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 10 రోజులు ఎండల తీవ్రతతో పాటు వర్షాలు కూడా కురవనున్నాయని చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మండిన ఎండలు.. నేడు వడగాడ్పులు
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 43.3 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1, తిరుపతి జిల్లా గొల్లగుంటలో 42.9, కృష్ణా జిల్లా కాజలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 మండలాల్లో వడగాడ్పులు వీచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.
మంగళవారం అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 212 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మంగళవారం అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment