సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నైరుతి సీజన్ మొదలైన రెండు నెలలకే సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా తొలకరి సమయంలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం దాదాపు 4–5 రోజుల్లోనే నమోదైంది. అనంతరం రుతుపవనాల కదలికలు కాస్త నెమ్మదించినప్పటికీ జూలైలో తిరిగి చురుకుగా ప్రభావం చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 36.31 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... సోమవారం నాటికి 56.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆరు జిల్లాల్లో రెట్టింపు వర్షపాతం...
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురవగా ఆరు జిల్లాల్లో సాధారణం కంటే రెట్టింపు వర్షాలు కురిశాయి. జగిత్యాల, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సాధారణం కంటే 100–150 శాతంఅధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వివరించింది. మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ జూన్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావడంతో అక్కడ కూడా 150 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదవగా 18 జిల్లాల్లో అధిక వర్షాలు, 6 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గతేడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో 107.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి కేవలం జూలైలోనే సాధారణం కంటే 57% అధికంగా వర్షాలు కురిశాయి.
అత్యధికం: నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాయ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి
అధికం: అదిలాబాద్, ఆసీఫాబాద్, జగిత్యాల, మహబుబాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం
సాధారణం: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ములుగు.
2 నెలలు... జోరు వానలు
Published Tue, Aug 3 2021 1:32 AM | Last Updated on Tue, Aug 3 2021 1:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment