సాక్షి, గుంటూరు: ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలికాబోతుందన్నారు. చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా దిట్ట అని, ప్రభుత్వ కుట్రలతో ఈ ప్రాజెక్టు బ్యారేజీ స్థాయికి పడిపోయిందన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మలరామానాయుడు అసలు కన్నా కొసరు ఎక్కువ మాట్లాడారని అంబటి మండిపడ్డారు. రెండు దశలు ఉండవంటూ నిమ్మల చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. ఆయనకు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేనట్టుందని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు ఏదైనా దశలవారీగా పూర్తిచేస్తారని తెలిపారు
ప్రాజెక్టు మొదటి దశలో 115.5 టీఎంసీల నిల్వకు పనికొస్తుందని.. చివరగా 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తేనే ప్రాజెక్టు పూర్తి ఫలితాలు అందుతాయని వివరించారు. అయితే 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరిగినా.. తప్పు వైఎస్సార్‌సీపీపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
‘చంద్రబాబు తప్పిదాలు చేస్తే వైఎస్‌జగన్ వచ్చాక వాటిని సరిచేశారు. బాబు తప్పిదాల వల్లే ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. చంద్రబాబు వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు తీవ్రమైన విఘాతం ఏర్పడింది. ప్రాజెక్టుకు ఆయన ఉరి వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
ఈ ప్రాజెక్టును ఆనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. బాబు స్వార్థం వల్ల ప్రాజెక్టు కుంటుపడింది. నేను చెప్పిన ప్రతి అంశం సత్య శోధనకు నిలబడింది. డయాఫ్రం వాల్ నిర్మాణం చంద్రబాబు చేసిన తప్పిదమే. కూటమి ప్రభుత్వం పోలవరానికి అన్యాయం చేస్తోంది. ప్రాజెక్టును పూర్తిచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వమే లాలూచీ పడింది. ఇంత ఘోరం జరుగుతుంటే గొంతెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీపై ఉంది. రాష్ట్ర ప్రజలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.
పోలవరం సెకండ్ ఫేజ్‌ను నాశనం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. డబ్బు కాజేయాలనే దురుద్దేశంతోనే ప్రాజెక్టును మీరు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏం చేశారు? పోలవరం కోసం ఇచ్చిన డబ్బునుడైవర్ట్ చేశారు. ఆ నింద వైఎస్సార్‌సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పని వల్ల జీవనాడికి తీవ్ర అన్యాయం. పోలవరంపై జరుగుతున్న కుట్రలపై ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికైనా చేసిన తప్పులను చంద్రబాబు సరిచేసుకోవాలి. తెలుగుజాతికి ద్రోహం చేయొద్దు.’ అని అంబటి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment