నిజాంసాగర్ : కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాల భవన సదుపాయాన్ని నిర్మించినా.. కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ అవస్థలు తప్పడం లేదు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్యలో మార్పు లేకపోవడం తో విద్యాబోధనపైనా ప్రభావం పడుతోం ది. ప్రయోగశాల ఉన్నా.. శిక్షకులు లేరు. దీంతో రూ. 3.2 కోట్లు వెచ్చించి నిర్మించిన మోడల్ స్కూల్ భవనం.. సమస్యల్లోనే ఆదర్శంగా నిలుస్తోంది.
కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడం కోసం రెండేళ్ల క్రితం ప్రభుత్వం మాడల్ పాఠశాలలను ప్రవేశపెట్టింది. మండలానికొకటి చొప్పున ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున కేటాయించింది. మొదటి విడతలో గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్య అందించనున్నారు.
గతేడాది ఆరు, ఎనిమిది, ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించారు. ఒక్కో తరగతిలో 80 సీట్లున్నాయి. భారీగా దరఖాస్తులు రావడంతో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు పెరిగాయి. 6, 7, 8, 9, ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తరగతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. అన్ని తరగతుల్లో పూర్తిస్థాయి విద్యాబోధనకుగాను ఒక్కో మోడల్ స్కూల్‌లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా స్కూళ్లలో ఎడెనిమిది మందే ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. దీంతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు.
ప్రయోగశాల ఉన్నా..
ఆదర్శ పాఠశాలలో ప్రభుత్వం ల్యాబ్ సౌకర్యం కల్పించింది. అయితే శిక్షకులు లేకపోవడంతో ఇది నిరుపయోగంగానే ఉంటోంది.
అసౌకర్యాలే..
నిజాంసాగర్ సమీపంలో నిర్మించిన మోడల్ పాఠశాలలో టాయ్‌లెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం సైతం లేదు. దీంతో ఇంటినుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మాడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
సమస్యల్లోనే ‘ఆదర్శ’మా?
Published Fri, Jul 4 2014 2:10 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement