కారుపై పోస్టర్‌తో బానోత్ ప్రకాశ్
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అవి పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో కొందరు ఉన్నత విద్యావంతులు, సామాజిక బాధ్యత గుర్తెరిగినవారు ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వస్తున్నారు. డబ్బులకో.. మద్యానికో లొంగిపోయి ఓటును అమ్ముకుంటే ఐదేళ్ల పాటు సమస్యల్లోనే కొట్టుమిట్టాడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ముగ్థుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అవుసుల తండాకు చెందిన బానోత్ ప్రకాశ్ ఇలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయన ఎంటెక్ చదివారు. గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన పనిలోపనిగా ఓటు విలువ తెలియ చేస్తున్నారు. రూ. 500 ఇచ్చి ఓటు కొనుక్కొని గెలిచినవారు ఐదేళ్లపాటు పదవిలో ఉంటారని, ఆయన ఇచ్చిన మొత్తాన్ని ఐదేళ్ల కాలానికి లెక్కకడితే రోజుకు 27 పైసలు అవుతుందని పేర్కొంటున్నారు. 27 పైసలకోసం భవిష్యత్‌ను అమ్ముకోవద్దని సూచిస్తున్నారు. మంచి అభ్యర్థినే గెలిపించుకోవాలని కోరుతున్నారు.