సాక్షి, కామారెడ్డి: ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నా.. కొందరు దాన్ని లైట్ తీసుకుంటున్నారు. సర్కారుకు సహకరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన పట్టణంలోని పాత బస్టాండ్ గోదాం రోడ్ ప్రాంతంలో ఓ వివాహం జరిగినట్లు అధికారులకు శనివారం సమాచారం అందింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్, బాన్సువాడల నుంచి పలువురు వివాహ వేడుకలో పాల్గొన్నట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోదాం రోడ్‌లో విచారణ చేపట్టారు. (పెళ్లి పెద్దలు పది మందే..! )
అయితే అధికారుల అనుమతి తీసుకోకుండానే నిఖా జరిపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం.. విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. వివాహానికి 12 మందికి పైగా వచ్చారని ఒకరు, ముగ్గురమే ఉన్నామని మరొకరు, తమ మత పెద్ద లేకపోవడంతో అసలు పెళ్లే జరగలేదని ఇంకొకరు సమాధానం ఇచ్చారని సమాచారం. ఇలా పొంతనలేని సమాధానాలు ఇచ్చినవారిలో బాన్సువాడ డివిజన్‌కు చెందిన ఓ పీఎంపీ, మరో ల్యాబ్ టెక్నీషియన్ ఉండటం గమనార్హం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ ముగ్గురినీ భిక్కనూరులోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించామని వైద్యాధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment